కేరళలో నిరాటంకంగా కురుస్తున్న వర్షాలకు అల్ప పీడనమే కారణమని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల సమయంలో ఏర్పడిన డిప్రెషన్.. సాధారణంగా 10 రోజుల వరకు ప్రభావం చూపిస్తుంది. అయితే డిప్రెషన్‌లో ఉన్న తీవ్రతను బట్టే వర్షం కొనసాగుతుందని డైరక్టర్ చెప్పారు. రుతుపవనాల సమయంలోనే ఈ సారి 30 శాతం ఎక్కువ వర్షం కురిసింది. దానికి తోడు అల్పపీడనం కూడా కదలిక లేకుండా ఉందన్నారు, సాధారణంగా దక్షిణంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తరం దిశగా పయనిస్తుంది. కానీ ఈసారి దక్షిణంలోనే కేంద్రీకృతం కావడం వల్ల కేరళను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేరళలో మరో వారం రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు.కేరళలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీవర్షాలకు మున్నార్‌లోని 'ప్లమ్ జూడీ రిసార్టు'లో చిక్కుకున్న 54 మంది పర్యాటకులను ఆర్మీ కాపాడింది. వీరు గత రెండు రోజులుగా రిసార్టులోనే చిక్కుకుపోయారు. వీరిలో 20 మంది విదేశీ టూరిస్టులు కూడా ఉన్నారు. వీరిని ఆర్మీ, విపత్తు నిర్వహణ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బీభత్సానికి ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 29కు చేరింది. ముఖ్యంగా పాలక్కాడ్, వయనాద్, కొజిక్కోడ్ జిల్లాల్లో వరద తీవ్రస్థాయిలో ఉంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ ప్రమాదకరస్థాయికి చేరాయి. చెరుథోని డ్యామ్ ఐదు గేట్లను తెరిచారు. ముందుజాగ్రత్తగా డ్యామ్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. నీటి ఉధృతితో ఇడుక్కి డ్యామ్ అన్ని గేట్లను ఎత్తేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. మరోవైపు పాలక్కాడ్ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇరువని, ఎంగప్పుజ, చెర్పుజ, మరిప్పుజ, ముఠప్పన్ నదులు పొంగి పొర్లుతున్నాయి. పెరియార్ నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుండంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇడుక్కి రిజర్వాయర్ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇడుక్కితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. కర్ణాటక సరిహద్దులోని తూర్పు కొండ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. కొండచరియలు విరిగి పడుతుండటంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపత్తు నిర్వహణ సిబ్బందితోపాటు వైమానిక, నేవీ దళాలు హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నాయికేరళలో కురుస్తున్న వర్షాలతో ఇప్పటివరకు దాదాపు 53 వేల మంది నిర్వాసితులు కాగా.. వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 500 వరకు పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వర్షాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తర జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఐదు ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. విపత్తుపై పినరయి విజయన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.