బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ పతనం కోసమే తాము ఇక్కడున్నామని ఆయన స్పష్టం చేశారు. అమిత్ షా ఇవాళ కోల్‌కతాలో జరిగిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్.. మమతను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అసోంలో జాతీయ పౌరసత్వ జాబితాపై గత కొన్ని రోజులుగా వీళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి ర్యాలీలోనూ అదే అంశంపై మమతను నిలదీశారు షా. బంగ్లాదేశ్ వలసదారులు మమత వోట్ బ్యాంక్ అని.. అందుకే వాళ్లను చేరదీస్తూ తన వోటు బ్యాంకును పదిలం చేసుకుంటున్నదని షా ఆరోపించారు. ఇదంతా జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్‌ఆర్‌సీ)కి విరుద్ధమని అమిత్ తెలిపారు. ఎన్‌ఆర్‌సీ పనే అక్రమంగా వలస వచ్చిన వాళ్లను బయటికి పంపించడమని అమిత్ వెల్లడించారు.ఓటు బ్యాంకు కాదు ముందు దేశం ముఖ్యం. దేశ భద్రత ముఖ్యం. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్లను ఎందుకు తిరిగి పంపించట్లేదు. మమ్మల్ని ఎలా విమర్శించాలనుకుంటే అలా విమర్శించు. కాని.. మేం మాత్రం ఎన్‌ఆర్‌సీకీ విరుద్ధంగా వెళ్లం. ఎన్‌ఆర్‌సీ పనిలో వేలు పెట్టం." అంటూ అమిత్ షా ఫైర్ అయ్యారు.కాగా ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే యూత్ కాంగ్రెస్ నేతలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అంతేగాక, అమిత్ షా కాన్వాయి వెళ్లేదారిలో ద్విచక్ర వాహనాలను అడ్డంగా ఉంచి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటిని తొలగించిన పోలీసులు... కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆయన పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు నిరసనలు తెలిపే అవకాశం ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.కోల్‌కతా విమానాశ్రయం చేరుకున్న అమిత్ షాకు భాజపా నేతలు స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ కైలాష్ విజయ్‌వర్గీయ, పార్టీ పశ్చిమ్‌బంగా అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో పాటు ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికి, తమ రాష్ట్రంలోనూ జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) జాబితాను పరిశీలించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల నిరసనల మధ్యే అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై అమిత్ షా తమ నేతలతో చర్చించనున్నారు.