నాటక రంగ ప్రముఖురాలు, నటుడు రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుది శ్వాసను విడిచారు. దీంతో కనకాల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అయితే 11ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించిన లక్ష్మీదేవి నాట్యకారిణిగా, నటిగా తెలుగు పరిశ్రమలో పనిచేశారు. అంతేకాకుండా మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో పలువురికి ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో 1971లో నటుడు దేవదాస్ కనకాలను వివాహం చేసుకున్న లక్ష్మీదేవి ఆ తరువాత వారి సొంత ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కూడా పలువురికి శిక్షణను ఇచ్చింది. సుహాసిని, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లు కూడా ఆమె దగ్గర శిక్షణ పొందిన వాళ్లే. ఇక తెలుగులో ప్రేమ బంధం, ఒక ఊరికథ, పోలీస్ లాకప్, కొబ్బరి బోండాం తదితర సినిమాలలో పలు పాత్రలలో నటించింది లక్ష్మీదేవి. ఇదిలా ఉంటే ఆమె మృతిపై పలువురు సానుభూతిని ప్రకటిస్తున్నారు.