పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత రోగులకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా ప్రత్యేక వైద్య నిపుణుల కొరత వేధిస్తోంది. సివియర్ కేసులకు కూడా జనరల్ వైద్యులకే చూపించాల్సి రావడంతో రోగులు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి. ప్రభుత్వం ప్రకటించే జీతాలకు ప్రత్యేక వైద్య నిపుణులు రావడం లేదని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. సివిల్ సర్జన్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, గైనకాలజిస్టు, చిన్న పిల్లల వైద్య నిపుణలకు నెలకు ప్రభుత్వం ఇచ్చేది సుమారు రూ.60 వేల వేతనమని, ఈ వేతనానికి ఎవరూ ముందుకురావడం లేదని తెలిపారు. జిల్లాలోని ఏరియా, సీసీహెచ్‌సీ ప్రభుత్వాసుపత్రులు మొత్తం 10. అందులో వైద్య నిపుణుల కొరత ఇలా ఉంది. నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తో సహా ఆరుగురు వైద్యులు ఉండాలి. కానీ ఒక వైద్యులు మాత్రమే ఉన్నారు. సిబ్బంది ఆరుగురికి గాను ఒకరు మాత్రమే ఉన్నారు. తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌తో కలిపి వైద్యులు ముగ్గురు ఉండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులు 12 మందికి గాను 10 మంది ఉన్నారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులు 10 మందికి గాను 9 మంది ఉన్నారు. ఒకరు లేరు, ఆర్‌ఎంఓ ఒకరు లేరు. నర్సింగ్ సూపరింటెండెంట్ లేరు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ లేరు.నర్సాపురం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ లేరు. ఐదుగురు వైద్యులకు గాను ఒకరు లేరు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తో సహా ఐదుగురు వైద్యులు ఉండాలి. ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇద్దరు వైద్యులు లేరు. డిప్యూటీ సివిల్ సర్జన్ లేరు. హెడ్ నర్సు ఒకరు, ఎస్‌ఎన్‌ఓ ఒకరు లేరు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మొత్తం సివిల్ సర్జన్ వైద్యులు 12 మంది ఉండాల్సి ఉంది. ఆరుగురు వైద్యులే ఉన్నారు, ఆర్‌ఎమ్‌ఓ లేరు. డిప్యూటీ సివిల్ సర్జన్ లేరు. సివిల్ అసిస్టెంట్ వైద్యులు 27 మందికి గాను 26 మంది ఉన్నారు. సిబ్బంది 30 శాతం లేరు. చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో సివిల్ సర్జన్, చిన్న పిల్లల వైద్యులు, మత్తు వైద్యులు, దంత వైద్యులు లేరు. ఇక్కడ రోగుల సంఖ్య 300 నుంచి 400 వరకు ఉండగా సూపరింటెండెంట్ వైద్య సేవలు అందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో నలుగురు సివిల్ సర్జన్ వైద్యులు ఉండాలి. కానీ ఒకరు లేరు. ఆర్‌ఎంఓ లేరు. దెందులూరు ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ వైద్యులు లేరు, రేడియోగ్రాఫర్ లేరు. కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ వైద్యులు ఒకరు లేరు. ఫార్మాసిస్ట్ ఎవరూ లేరు.