నిబంధనలను తుంగలో తొక్కి తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో మూసేస్తున్నది. ఈ కోవలో ముఖ్యంగా ప్రభుత్వం దళిత వాడలను లక్ష్యంగా చేసింది. జిల్లాలో మండలపరిషత్, జిల్లా పరిషత్, ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలు 2647 ఉన్నాయి. 590 రాష్ట్ర ప్రభుత్వం జిఒ నెంబరు ఒకటి ప్రకారం దళితవాడల్లో, లోయలు, చెరువులు, నదులు, బ్రిడ్జిలు, హైవేలు తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయకుండా చూడాల్సి ఉంది. ఆయా పాఠశాలలో నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్య లేకున్నా సడలింపునకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం విద్యా ప్రయివేటీకరణే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ప్రధానంగా దళితవాడల్లోని పాఠశాలలను మూసివేయటంతో అక్షరాశ్యతపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు ఇంటి పట్టనే ఉంటున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులతో కలిసి పనులకు వెలుతున్నారు. 25 ఎస్సీ, ఎస్టీ కాలనీలలో, పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలను మూసేయటంతో ఆయా ప్రాంతాల్లోని దళిత కుటుంబాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. గార్లదిన్నె మండలం కెకె తండా, గుడిబండ మండలం ఎస్సీ కాలనీ, పెనుకొండ మండలం గుట్టూరు మక్కాజి తండా, కొత్తచెర్వు గిరిజన తండా, కళ్యాణదుర్గం, కదిరి, రాయదుర్గం, గుత్తి తదితర ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాలకు సమీపంలోని బడులు మూసివేయటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1468 పాఠశాలలను ప్రభుత్వం మూసివేయగా అందులో 30 శాతానికి పైగా దళిత వాడల్లోని పాఠశాలలు ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఐదు వేల పాఠశాలలను మూసివేయటానికి సిద్ధపడింది. కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాల పోరాటాలతో వెనకడుగువేసింది. అయితే అందులోను అగ్రభాగం ఎస్టీ, ఎస్సీ కాలనీలలోని పాఠశాలలే ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దళితులు, ముఖ్యంగా సంపూర్ణ అక్షరాశ్యతపై ప్రభావం చూపనుంది.గుడిబండ ఎస్సీ కాలనీలో గత 15 సంవత్సరాల క్రితం డిపెప్ పాఠశాలను నిర్మించారు. అప్పటి ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి రెండు పాఠశాల భవనాలు కూడా నిర్మించింది. పాఠశాల మూతవేయడంతో చదవుకు దూరమవ్వాల్సి వస్తున్నది. నిరుపేదలైన దళితులం కావటంతో చదివించే స్థోమత లేదు. పాఠశాల దూరమవటంతో పాపను చదువు మానిపించి పనికి తీసుకెళ్లాల్సి వస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలను ఎస్సీకాలనీలోనే కొనసాగించే విదంగా చర్యలు తీసుకుంటే ప్రయోజనం.