డీఎంకేలో కుటుంబ తగాదాలు తలెత్తకుండా కుటుంబసభ్యులు రంగంలోకి దిగారు. ఆళగిరిని సముదాయించే పనిలో ఉన్నారు. ఈ నెల 14వ తేదీన డీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. తొలుత ఈ సమావేశంలోనే స్టాలిన్ ను డీఎంకే అధ్యక్షుడిగా చేయాలని భావించారు. అయితే ఆళగిరితో పూర్తి స్థాయి చర్చలు జరిపి, ఆయనతో ఒక అంగీకారం కుదిరిన తర్వాతనే డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ను ప్రకటించాలని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే సర్వ సభ్య సమావేశంలో కేవలం కరుణానిధి మృతికి సంతాపం ప్రకటించేందుకే పరిమితమవుతారని తెలుస్తోంది.ఆళగిరి వాస్తవానికి ఇప్పుడు పార్టీలో లేరు. ఆయనను కరుణానిధి బతికున్నప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కరుణ మృతితో తిరిగి ఆళగిరి పార్టీలో కీలక భూమిక పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. పెద్ద కుమారుడిగా తాను పార్టీని నడిపిస్తానని సన్నిహితుల వద్ద ఆళగిరి వ్యాఖ్యనించారని తెలుస్తోంది. ఆళగిరి ఫేస్ బుక్ లో ఒక వీడియో పోస్టు చేశారు. అది తమిళనాడులోనూ, డీఎంకేలోనూ కలకలం రేపుతుంది.ఈ వీడియోలో తనను అడ్డుకునేవాడు ఎవరురా? అనే పాట ఉంది. కొన్నేళ్ల క్రితమే ఈ వీడియోను రూపొందించినా శనివారం ఈ వీడియోను ఆళగిరి తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేయడంతో వారసత్వ పోరు తప్పదని తేలిపోయింది. ఈ పాటలో “ఇక ఆటను చూడరా…అడ్డుకునేది ఎవడురా….సింహ తమిళ..అంటూ పాట సాగడంతో ఆళగిరి ఖచ్చితంగా డీఎంకేలో పెద్ద పదవినే ఆశిస్తున్నారని అర్థమవుతుంది. ఈ పాటను ఫేస్ బుక్ పేజీలో ఆళగిరి స్వయంగా పోస్ట్ చేయడంతో కుటుంబ సభ్యుల్లోనూ కలవరం బయలుదేరింది. కరుణ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. పార్టీలో ఆళగిరికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కుటుంబ సభ్యులు కూడా స్టాలిన్ కు సూచించారు. అయితే తనకు కీలకమైన పదవి ఇవ్వాల్సిందేనని ఆళగిరి పట్టుబడుతున్నారు. స్టాలిన్ అధ్యక్షుడయితే తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, ప్రధాన కార్యదర్శి పదవి గాని కావాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవి కాని, పార్టీ అధ్యక్ష పదవి కాని కావాలని ఆయన మెలిక పెడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు వీరిద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఫలిస్తాయో? లేదో?