కాపు సీనియర్ నేతలు జనసేన వైపు చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాయల్లో సీనియర్ అయిన హరిరామజోగయ్య.. తన సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ చెంతన చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో.. అందులో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ మొదలైంది. టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ.. ఇలా అన్ని పార్టీల్లోనూ కాలు పెట్టి.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికలకు మరో 9 నెలలు గడువు ఉన్న నేపథ్యంలో.. జనసేనలోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాపు సామాజికవర్గంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ఆయన.. వాటినే అస్త్రాలుగా చేసుకుని బరిలోకి దిగాలని భావిస్తున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్‌కు పవన్‌కు ఉన్న అభిమానులు తోడయితే.. విజయం తథ్యమనే ఆలోచనలో ఉన్నారట.2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పోటీచేస్తారని ఎవరూ ఊహించ లేదు. కానీ అనూహ్యంగా అక్కడి నుంచి చిరును బరిలోకి దింపిన వారిలో తొలి పేరు హరిరామ జోగయ్యదే ఉంటుంది. అయితే అక్కడి నుంచి చిరు ఓడిపోవడం అభిమానులను కూడా నిరాశకు గురిచేసింది. ఇప్పుడు మళ్లీ ఆ సీనియర్ నేతను పవన్.. తన పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు న్నాయని అంటున్నారు విశ్లేషకులు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో పవన్ పర్యటించారు. ఇదే సమయంలో హరిరామజోగయ్యను కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ను కూడా ఆయన సత్కరించారు. తాను `సేనాని` పేరుతో ఒక సినిమా తీస్తున్నానని కూడా జోగయ్య చెప్పారు. అనంతరం ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయని తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో బలమైన నేత, సీనియర్ తమ పార్టీలోకి వస్తే.. జనసేనకు మరింత బలం చేకూరుతుందని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.ఆయన ఏ పార్టీలో ఉన్నా.. అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. ప్రజారాజ్యంలో ఉండగా.. చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసిన సమయంలో.. ఆయన అక్కడ గెలవలేరు.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. ఆయన ప్రభావం చాలా చూపిస్తారనే గుర్తింపు పొందారు. ప్రస్తుతం మరో పది నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో మళ్లీ ఒక్కసారిగా జోగయ్య మళ్లీ రాజకీయ ప్రవేశం చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన జోగయ్య.. ఆ వర్గంలో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. మంచి మద్దతును కూడ గట్టగలరనే నేతగా కూడా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో పశ్చిమలో కుల సమీకరణాలు మారుతున్నాయి. జనసేనాని కూడా ఉభయ గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా దృష్టిసారించడం, తన సామాజికవర్గ నేతలపై ప్రధానంగా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జోగయ్య.. వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్, వైసీపీలు కూడా ఇక్కడ నుంచి పోటీ కి బలమైన అభ్యర్థులనే నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇక, జనసేన పార్టీకి అభ్యర్థి ప్రధాన సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన జోగయ్యకు ఇక్కడ నుంచి టికెట్ ఇవ్వడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చనేది నాయకుల మాట.