- ఈ నెల 4న విజయవాడలో టీడీపీ ముఖ్య నేతలంతా భేటీ
-
బడ్జెట్‌పై బోలెడు ఆశలు పెట్టుకుంది ఏపీ. మోదీ సర్కార్ ఈ దఫాలో చివరిసారిగా ప్రవేశ పెడుతున్న ఫుల్ లెంగ్త్ బడ్జెట్ కావడంతో కొండంత ఆశలు పెట్టుకున్నారు. కానీ, చివరికి ఆయన హ్యాండ్ ఇచ్చారు. చేత్తో చిల్లిగవ్వ కూడా విదిలించలేదు. దీనిపై మిత్రపక్షమైన టీడీపీ నేతలే విరుచుకుపడుతున్నారు. బీజేపీతో కటీఫ్ చెప్పి బయటకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే….. మనం కూడా పుట్టి మునుగుతామని చంద్రబాబుపై నేతలు ప్రెజర్ చేస్తున్నారు. ముందుగా కేంద్రంలోని మంత్రులతో రాజీనామా చేయించాలని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తర్వాత ఎంపీలకు దిశా నిర్దేశం చేసి పార్లమెంట్‌లో రగడ క్రియేట్ చేసి… ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని వారు బాబుకు విన్నవిస్తున్నారు.
బీజేపీతో పొత్తుతోపాటు…. కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలి…? ఏపీకి న్యాయం జరిగేలా ఎలా చూడాలి… అనే అంశాలపై ఈ నెల 4న విజయవాడలో టీడీపీ ముఖ్య నేతలంతా భేటీ అవుతున్నారు. మరి, ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు రానున్నాయి…? టీడీపీ-బీజేపీ బంధానికి కాలం చెల్లనుందా….? ఎన్‌డీఏ సర్కార్‌లో కొనసాగుతున్న తమ మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయిస్తారా..? లేక, సర్దుకుపోదాం అని పిలుపునిస్తారా…? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, టీడీపీకి సంబంధించి బీజేపీతో కటీఫ్‌పై చంద్రబాబుకు పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడప్పుడే బంధం తెంచుకుంటే… అది ఏపీలో ఈ రాజకీయ అవకాశవాదానికే గుంటనక్కలా ఎదురుచూస్తున్న వైసీపీకి కలిసి వస్తుందని, వారు కమలంతో పొత్తుకు సై అంటారని అంటున్నారు. ఆ రెండు పార్టీలు గెలిచినా, గెలవకపోయినా… ముందు జగన్ కేసుల నుంచి బయటపడతాడు…. ఇది టీడీపీకి ఎంతమాత్రం మింగుడుపడని విషయం. అందుకే, నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ వరకు బీజేపీతో పొత్తుపై ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నాడట చంద్రబాబు. మరోవైపు, ఏపీ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు విపరీతంగా శ్రమిస్తున్నా… కేంద్రం సాయం చేయడం లేదనే ఫీల్… రాష్ట్రం అంతటా వ్యాపించింది. ఇది కూడా తమకు కలిసి వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇదే సెంటిమెంట్‌గా కూడా మారిందని అంటున్నారు. ఇటు, కేంద్రం చిన్న సాయమయినా చేసి ఉంటే… ఏపీ డెవలప్‌మెంట్‌లో పరుగులు పెట్టేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రత్యేక హోదాకి మంగళం అర్పించారు. స్పెషల్ ప్యాకేజ్‌కి తూట్లు పొడిచారు. ఇక, ఆర్ధిక సాయం కూడా చేయడం లేదు. వీటి అన్నింటినీ పక్కన పెట్టినా… పోలవరానికి అయినా అంతో ఇంతో సాయం చేస్తారని భావిస్తున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం పూర్తి చేస్తే అది చాలు… ఇన్ని త్యాగాలు చేసినందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది.. ఇదేనట చంద్రబాబు ఆలోచన. పోలవరంతో ఏపీ రూపు రేఖలే మారిపోతాయని అంచనా వేస్తున్నారు చంద్రబాబు. లక్షల మంది రైతులకు ఇది సిరుల పంట పండిస్తుందనే లెక్కలు ఉన్నాయి. అందుకే, ఏపీకి జీవనాడిలాంటి పోలవరం కోసం చంద్రబాబు ఇన్ని అవమానాలయినా దిగమింగడానికి రెడీ అవుతున్నారట చంద్రబాబు.ఇక, రాజకీయంగా తమను ఇంతలా ఇరుకునపెడుతున్న బీజేపీని కూడా బాగా ఇరుకునపెట్టాలి. కానీ, దానికి కాస్త సమయం ఉంది. కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల తర్వాత బీజేపీలో మార్పులు వచ్చే అవకాశం పక్కాగా కనిపిస్తోంది. ఎందుకంటే… కర్నాటకలో మళ్లీ కాంగ్రెస్ జెండానే ఎగరనుంది. ఇటు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోనూ బీజేపీకి ఎదురుగాలి తప్పడం లేదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే దీనికి నిదర్శనం. నవంబర్ నాటికి వీటి ఫలితాలు తేలిపోతాయి. దీంతో, బీజేపీ వెనక్కి తగ్గాలి.. లేదా చేతులు ఎత్తేయాలి.. ఇదే చంద్రబాబు భావన. ఆ సమయం కోసమే బాబు ఎదురు చూస్తున్నాడని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో వైసీపీ బలపడకూడదు. ఇలా, ఏపీ అభివృద్ధి, రాజకీయం రెండూ కలగలిసి ఉన్నందునే చంద్రబాబు బీజేపీతో పొత్తుపై ఆచితూచి వ్యవహరిస్తున్నాడని అంటున్నారు.