కనీవిని ఎరగని రీతిలో భారీ వర్షాలు, వరదలు కేరళను వణికిస్తున్నాయి. వరదల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు పాడవగా.. విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, కట్టడాలు కూలిపోయాయి. వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఏరియల్ సర్వే నిర్వహించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తక్షణమే రూ.100 కోట్లను సాయంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. కష్టాల్లో ఉన్న కేరళ ప్రజలను ఆదుకోవడానికి రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు చేతులు కలపాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. కేరళ ప్రభుత్వం సాయం కోసం అభ్యర్థిస్తోంది. ఎన్జీవోలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేరళను ఆదుకోవడానికి ఇతోధికంగా ముందుకొస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న సాటి భారతీయులను ఆదుకోవడం కోసం ఆర్థిక సాయం ఎలా చేయొచ్చో చూద్దాం.. సీఎం డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌కు సాయం చేయాలని కేరళ ప్రజానీకాన్ని, ఎన్నారైలను పినరయి విజయన్ అభ్యర్థించారు. సాయం చేయాలనుకునే వారు చెక్కులు, డీడీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సీఎండీఆర్‌ఎఫ్‌కు డబ్బులు పంపొచ్చు. రూ. 100,రూ.500 ఇలా మీకు తోచిన సాయం చేయడం వల్ల వరద ముంపులో చిక్కుకున్న వారిని ఆదుకున్న వారవుతారు.