ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పకడ్భంది ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మేడారం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మున్సపిల్ శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ శ్రీ అర్వింద్ కుమార్, పర్యాటక,సాంస్కృతిక కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం, దేవాదాయశాఖ కమీషనర్ శ్రీ శివశంకర్, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ శ్రీమతి క్రిస్టినా జడ్ చొంగ్తూ, శ్రీ నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జరిగే సమ్మక్క, సారమ్మ జాతరను జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ప్రచారం లభించేలా చూడాలని, కుంభమేళ తరహాలో ఏర్పాట్లు చేయ్యాలని అన్నారు. అంతర్జాతీయ ఛానెల్, బ్లాగులు, సోషల్ మీడియాను వినియోగించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. విదేశీయాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని అన్నారు. గతంలో వరంగల్ కలెక్టరుగా పనిచేసిన శ్రీమతి కరుణను జాతర కోసం ప్రత్యేక అధికారిణిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులను, సెక్రటరీలను, గిరిజన పార్లమెంటు సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సి.యస్ ఆదేశించారు. జాతర కోసం వచ్చే వివిధ ముఖ్య అతిధులను తగు ప్రోటోకాల్ లో ఆహ్వానించాలని అన్నారు. మేడారంలో పారిశుధ్యానికి ప్రత్యేక శ్రధ్ద తీసుకోవాలని మున్సిపల్ శాఖ ద్వారా తగు సిబ్బందిని నియమించాలని, సరిపడ అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించాలని ఆదేశించారు. సాంస్కృతిక దేవాదాయశాఖ అధికారులు జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శాఖలవారిగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు. టూరిజం శాఖ ద్వారా ప్రత్యేక బ్రోచర్ ను విడుదల చేయాలని అన్నారు. జాతర కోసం హెలికాప్టర్ సేవలను కూడా యాత్రికులకు కల్పించాలన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్భంది కలగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.