ఆయనో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే! ఆ నియోజకవర్గం మొత్తం అధికార పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాతి స్థానంలో ఉన్న సీనియర్ నాయకుడి కంచుకోట! అందులోనూ కీలకమైన మంత్రి పదవిలో ఉన్నాడు! ఇక ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు! ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా పరిస్థితి దయనీయంగా మారింది. మంత్రి యనమల రామకృష్ణుడికి బాగా పట్టున్న నియోజకవర్గం కావడంతో.. ఎమ్మెల్యేను తీవ్రంగా తొక్కేసే ప్రయత్నాలు నాలుగేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో మళ్లీ ఎమ్మెల్యే లైమ్‌లైట్‌లోకి వచ్చారు. యనమల ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత మళ్లీ బయటపడింది. యనమల సోదరుల దౌర్జ న్యాలు, అక్రమాలే ఎమ్మెల్యేకు శ్రీరామరక్షగా మారాయి. ఈ నేపథ్యంలో తునిలో యనమల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!మంత్రి యనమల ఇలాకా తునిలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ పాదయాత్ర తునిలో కూడా ముగిసింది. ఇక్కడ అనూహ్య జనసందోహం పాదయాత్రకు తరలివచ్చింది. ఇది యనమల సోదరులపై ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తోందంటున్నారు విశ్లేషకులు. యనమల కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లోనూ యనమల ఫ్యామిలీ ఓడిపోతూ వస్తోంది. తెలుగు దేశంలో నంబర్ టూ అయిన ఆర్థిక మంత్రి యనమల ఆ నియోజక వర్గాన్ని కంటి సైగతో శాసిస్తున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ క్యాబినెట్ హోదాలోనే ఉండేవారు యనమలకు నియోజక వర్గంపై తిరుగులేని పట్టుంది. గత ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణునిపై దాడి శెట్టి రాజా పోటీచేసి భారీ మెజారిటీతో గెలిచారు.మళ్లీ జగన్ ప్రజా సంకల్ప యాత్రతో రాజా మళ్లీ కనపడుతున్నారు. తుని నియోజక వర్గంలో జగన్ వెన్నంటే తిరిగే అవకాశం దొరికింది. ప్రస్తుతం యనమల వర్గం బుల్డోజింగ్‌తో ఎమ్మెల్యేపై సానుభూతి మరింతగా పెరిగింది. ఎమ్మెల్యే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారనే కంటే.. యనమల సోదరుల వల్లే ఇలా అవుతోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే ఎమ్మెల్యేకు ప్లస్ అయింది. ఎవరు అధికారం ముసుగులో అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్నారో, ఎవరు ఆధిపత్యం చెలాయిస్తున్నారో ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇవన్నీ రాజాపై ప్రజల్లో సానుకూలత ఏర్పడేలా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ టిక్కెట్ ను అంగబలం, అర్ధబలం ఉండి, గత ఎన్నికల్లో గెలిచిన దాడి శెట్టి రాజాకే దక్కనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన వైపే ప్రజలు మొగ్గుచూపే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇక యనమల మళ్లీ ఏ ఎమ్మెల్సీకో వెళ్లడమే తప్ప తునిలో మాత్రం ఆయన కాని, ఆయన ఫ్యామిలీ కాని గెలిచే పరిస్థితులు అయితే లేవన్నది మాత్రం విశ్లేషకుల అంచనా.