;ఇప్పటి వరకూ 57.41 శాతం మేర పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 42.89 శాతం మెయిన్ డామ్, మట్టిపనులు 71 శాతం, కాంక్రీట్ 33.7 శాతం పూర్తయ్యాయన్నారు. స్పిల్ వేలో రెండొంతుల పనులు, రేడియల్ గేట్లు 61.7 శాతం పూర్తయ్యాయని వివరించారు. జెట్ గ్రౌటింగ్ పనులు జరుగుతున్నాయి. కనెక్టివిటీ పనులు 58.71 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 62.7శాతం మేన పోలవరం ఎడమ కాల్వ పనులు పూర్తయ్యాయి. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పనులు 57.41 పూర్తయ్యాయని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఈ ఖరీఫ్ లో ఇప్పటి వరకూ 31.5 టిఎంసీలు పట్టిసీమ ద్వారా కృష్ణానదికి తరలించామన్నారు. పురుషోత్తమ పట్నం లిఫ్ట్ ద్వారా ఏలేరుకు నీరు తీసుకువెళ్లామన్నారు. ఏలేరు రిజర్వాయర్ ద్వారా పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నామని, త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కూడా తరలిస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఈ నెల 31వ తేదీన రెండో దశ పురుషోత్తమపట్నం పనులను సీఎం చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేస్తారు. ఏలేరు రిజర్వాయర్ ద్వారా జూన్‌లోనే నీరు ఇవ్వగలగడానికి పురుషోత్తమ పట్నం లిఫ్టే ప్రధాన కారణమన్నారు. దాదాపు అయిదు నియోజక వర్గాలలో రెండు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామన్నారు.సెప్టెంబర్ మొదటి వారంలో గ్యాలరీ వాక్ నిర్వహించాలని సీఎం సమక్షంలో నిర్ణయించామన్నారు. పండగ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరంలో 8 కోట్ల 50 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తి అయ్యింది. ఇంకా రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం జరగాల్సి ఉందన్నారు. 11,115 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగించి రేడియల్ గేట్లను తయారు చేస్తున్నామన్నారు. జెట్ గ్రౌటింగ్ అప్పర్ సైడ్‌లో పూర్తయిందన్నారు. 14,525కోట్ల రుపాయలను ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకుపై ఖర్చు చేశాము. రూ.5,135కోట్లు ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకముందు, రూ. 9,389 కోట్లను జాతీయ హోదా వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్లలో ఖర్చు చేశామని అన్నారు. చేసిన ఖర్చులో రూ.6,727కోట్లను కేంద్రం విడుదల చేసిందని, మరో రూ.2662 కోట్లు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. కేంద్రం అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నామన్నారు. సవరించిన అంచనాలపై అన్ని సందేహాలను నివృత్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 57 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 9 ప్రాజెక్టులను ప్రారంభించామని, ప్రారంభానికి సిద్ధంగా ఆరు ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. 28ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. మార్చి నాటికి మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. కొత్తగా మరో 13 కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నామన్నారు. 57వ ప్రాజెక్టుగా కుప్పం తీసుకున్నామన్నారు. గడిచిన నాలుగేళ్లలో రూ.45,035 కోట్లను ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. రూ.10,844 కోట్లతో జల సంరక్షణ, చెక్ డామ్ లు, పంట కుంటల కోసం వెచ్చించామన్నారు. రూ.139 కోట్లను అటవీ శాఖ కింద ఖర్చుచేశామన్నారు. నాలుగేళ్లలో మొత్తం 56068 కోట్లను జలవనరుల శాఖ చేసింది.జగన్ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో..లేదో? అర్ధం కావడం లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. శాంతి భద్రతల్ని కాపాడే తమపై రైలు తగులబెట్టామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ చరిత్ర నుంచి వచ్చిన జగన్, దొంగే దొంగ అన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడో అర్ధమవుతోందన్నారు. ప్రతి పక్ష నేతగా ప్రజలు ఇచ్చిన అవకాశం కూడా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. జీతాలు తీసుకుంటూ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎగ్గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ కు ఎల్లో మీడియా పేర్లు చెప్పే దమ్ము ధైర్యం కూడా లేవన్నారు. ఈ ప్రాజెక్టుపై జగన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయించారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పట్టిసీమ మాదిరిగానే పురుషోత్తమపట్నంపైనా కేసులు వేయించారన్నారు.