YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రివ్యూ : "గీత గోవిందం"..!!

 రివ్యూ  : "గీత గోవిందం"..!!

 సినిమా పేరు: గీత గోవిందం

నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన, వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సుబ్బరాజు, అన్నపూర్ణ, సత్యం రాజేశ్‌, నాగబాబు, కల్యాణి, గిరిబాబు, గౌతం రాజు తదితరులు

సంగీతం: గోపీ సుందర్‌

కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్

సినిమాటోగ్రఫీ: మణికందన్‌

నిర్మాతలు: అల్లు అరవింద్‌, సత్య గామిడి, బన్నీ వాసు

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పరశురాం

 యువ‌త‌రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఉన్న క్రేజే వేరు. `అర్జున్‌రెడ్డి`తో అది మ‌రో స్థాయికి వెళ్లింది. ఆ చిత్రం త‌ర్వాత విజ‌య్ క‌థ‌ల ఎంపిక‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే `గీత గోవిందం` ప్ర‌చార చిత్రాలు ఊరించాయి. `అర్జున్‌రెడ్డి` త‌ర్వాత విజ‌య్ నటించిన చిత్రం కావ‌డం... అది కూడా గీత ఆర్ట్స్ నుంచి వ‌స్తుండడంతో `గీత గోవిందం`పై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కావ‌ల్సినంత ప్ర‌చారం సంపాదించుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం!

క‌థేంటంటే: విజ‌య్ గోవింద్ (విజ‌య్ దేవ‌ర‌కొండ ) ఓ క‌ళాశాల‌లో లెక్చ‌ర‌ర్‌. ప‌ద్ధ‌తైన కుర్రాడు. అంతే ప‌ద్ధ‌తైన అమ్మాయి త‌నకి భార్య‌గా రావాల‌ని కోరుకుంటాడు. సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన అమ్మాయిల్ని ఊహించుకుంటూ క‌ల‌లు కంటుంటాడు. ఉన్న‌ట్టుండి తన‌కి క‌ల‌లో కనిపించిన అమ్మాయే బ‌య‌ట తార‌స‌ప‌డుతుంది. ఆమె పేరు గీత (ర‌ష్మిక మంద‌న). తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు గోవింద్‌. ఇంత‌లో కాకినాడ వెళుతున్న‌ప్పుడు త‌న సీటు ప‌క్క‌నే వ‌చ్చి కూర్చుంటుంది గీత. అనుకోకుండా ఆమెని ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దు సెల్ఫీగా కూడా తీసుకుంటాడు. దాంతో కంగారుప‌డిన గీత త‌న అన్న‌య్య (సుబ్బరాజు)కి జ‌రిగిన విష‌యం చెబుతుంది. దాంతో కాకినాడ‌లో మాటువేసిన గీత అన్న‌య్య‌, అత‌డి బృందం గోవింద్‌ని ఏం చేశారు? గోవింద్, గీత ఆ త‌ర్వాత ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: చెప్పుకోద‌గ్గ క‌థేమీ కాదు. కానీ క‌థ‌నంతోనూ, హాస్యంతో కూడిన సన్నివేశాల‌తోనూ ద‌ర్శ‌కుడు మాయ చేశాడు. దానికి విజ‌య్ దేవ‌రకొండ, ర‌ష్మిక ప్ర‌తిభ తోడైంది. దాంతో ఆద్యంతం న‌వ్విస్తూ... చివ‌ర్లో సుతిమెత్త‌గా హృద‌యాల్ని మెలిపెడుతూ ఆహ్లాదంగా ముగుస్తుందీ చిత్రం. ఆరంభ స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. రోడ్డుపై కూర్చున్న గోవింద్.. నిత్య‌మేన‌న్‌కి తార‌స‌ప‌డతాడు. అప్పుడు త‌న క‌థ చెప్ప‌డం మొద‌లుపెడ‌తాడు. నిత్య‌మేన‌న్ సినిమాలో ఏంటి? అని అనుకునేలోపే, మ‌రో క‌థానాయిక కూడా త‌ళుక్కున మెరుస్తుంది. గోవింద్... గీత‌ని చూడ‌టం, ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌టం వంటి విష‌యాల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. బ‌స్సులో ముద్దు వ్య‌వ‌హారం నుంచి క‌థ‌లో ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆత్రుత ప్రేక్ష‌కుడిలో వ్య‌క్త‌మ‌వుతుంది. అక్క‌డ్నుంచి క‌థ‌లో ప‌లు మ‌లుపులు చోటు చేసుకుంటాయి. క‌థ‌నం ప‌రంగా మ‌లుపులు... ఎప్ప‌టిక‌ప్పుడు కావ‌ల్సినంత హాస్యం పండిస్తూ స‌న్నివేశాల్ని తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. ముఖ్యంగా క‌థానాయ‌కుడికీ, అత‌డి స్నేహితుల‌కీ మ‌ధ్య స‌న్నివేశాలు బాగా పండాయి. ‘అర్జున్‌రెడ్డి’లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి స్నేహితుడిగా క‌నిపించి న‌వ్వించిన రాహుల్ రామ‌కృష్ణ ఈ చిత్రంలోనూ అదే స్థాయిలో న‌వ్వించాడు. గోవింద్‌, గీత‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా చ‌క్క‌టి వినోదాన్ని పంచుతాయి. మేడ‌మ్.. మేడ‌మ్ అంటూ విజ‌య్ చేసే హంగామా... ప్ర‌తి విష‌యంలోనూ అనుమానపడుతూ గోవింద్‌ని త‌న చుట్టూ తిప్పించుకునే గీత మ‌ధ్య స‌న్నివేశాలు బాగా పండాయి. ద్వితీయార్ధలో అక్క‌డ‌క్క‌డా సన్నివేశాలు సాగదీత‌గా అనిపించినా వినోదం మాటున అదేమీ ఇబ్బందిగా అనిపించ‌దు. ప‌తాక స‌న్నివేశాలపై మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు. భావోద్వేగాలు పంచుతూనే.. న‌వ్వులు పండించాడు.

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌ అభిన‌యం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. విజ‌య్ మంచి కామెడీ టైమింగ్‌ని ప్ర‌ద‌ర్శించాడు. అర్జున్‌రెడ్డి త‌ర్వాత త‌న‌కి త‌గ్గ క‌థ‌ని ఎంచుకుని... అందుకు త‌గ్గ‌ట్టుగానే అభినయం ప్ర‌దర్శించాడు. భావోద్వేగాలు కూడా బాగా పండించాడు. ర‌ష్మిక అందం... అభిన‌యం చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నాయి. ఆమె సినిమాలో చాలావ‌ర‌కు సీరియ‌స్‌గానే క‌నిపించాల్సి వ‌చ్చినా అందంతో ఆక‌ట్టుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి తండ్రిగా నాగ‌బాబు క‌నిపించారు. కానీ, ఆ పాత్ర‌కి వేరొక‌రు డ‌బ్బింగ్ చెప్ప‌డంతో స‌హ‌జ‌త్వం కోల్పోయింది. రాహుల్ రామ‌కృష్ణ‌ అండ్ గ్యాంగ్ న‌వ్వించింది. సుబ్బ‌రాజు ర‌ష్మిక‌కి అన్న‌య్య‌గా క‌నిపించాడు. వెన్నెల కిషోర్, అన్న‌పూర్ణ‌మ్మ క‌లిసి ప‌తాక స‌న్నివేశాల్లో క‌డుపుబ్బా న‌వ్వించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. మ‌ణికంద‌న్ కెమెరా ప‌నిత‌నం, గోపీసుంద‌ర్ స్వ‌రాలు చిత్రానికి బ‌లాన్నిచ్చాయి. పాట‌లు బ‌య‌ట వినిపించినంత అందంగా, తెర‌పై క‌నిపించ‌లేదు. ‘ఇంకేం కావాలి..’ పాట చిత్రీక‌ర‌ణ‌పై మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవా‌ల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌లో మంచి ర‌చ‌యిత ఉన్నాడ‌ని ఈ చిత్రంతో మ‌రోమారు రుజువైంది. స‌న్నివేశాలు రాసుకున్న విధానంలో ఆయ‌న ప‌నిత‌నం ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది.

బ‌లాలు:

+ క‌థ‌నం

+ హాస్యం

+ విజ‌య్‌, ర‌ష్మిక అభిన‌యం

బ‌ల‌హీన‌త‌లు

- ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా: గీత... గోవింద్ బాగా న‌వ్విస్తారు

Related Posts