- విదేశీ వర్తక డైరెక్టరేట్ జనరల్ ప్రకటన
ఉల్లిపాయల ఎగుమతులు పెంచేందుకు వాటిపై ఉన్న కనీస ఎగుమతి ధర (ఎం.ఇ.పి)ను ప్రభుత్వం శుక్రవారం తొలగించింది. ‘‘ఉల్లిపాయల ఎగుమతిపై ఎం.ఇ.పి.ని తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు తొలగిస్తున్నాం. అన్ని రకాల ఉల్లిపాయలను ఎం.ఇ.పి. లేకుండానే ఇప్పటి నుంచి ఎగుమతి చేయవచ్చు’’ అని విదేశీ వర్తక డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎం.ఇ.పి.ని తొలగిస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు కూడా ట్వీట్ చేశారు. ‘‘అన్ని రకాల ఉల్లిపాయలను ఇకనుంచి ఎగుమతి చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించేందుకు మేం అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఆయన చెప్పారు. ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టిన తర్వాత, వాటి ఎం.ఇ.పి.ని ప్రభుత్వం జనవరిలో టన్నుకు 150 డాలర్లు తగ్గించింది. పెరుగుతున్న ధరలు అరికట్టేందుకు అడపాదడపా ఎం.ఇ.పి.ని విధిస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు కిలో రూ. 40-45 మధ్య పలుకుతున్నాయి. ఉల్లిపాయల ధరలు 2017 సంవత్సర కడపటి నెలల్లో పెరగడం ప్రారంభించినప్పుడు 2000 టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవలసిందిగా ఎం.ఎం.టి.సి.ని ప్రభుత్వం కోరింది. స్థానికంగా ఉల్లిపాయలు కొని, వాటి వినిమయం ఎక్కువగా ఉన్న చోటుకు సరఫరా చేయవలసిందని అది నాఫెడ్, ఎస్.ఎఫ్.ఎ.సి. లాంటి ఇతర సంస్థలనూ కోరింది. దేశంలోని మొత్తం ఉల్లి పంటలో సుమారు 40 శాతం ఖరీఫ్ సీజన్‌లో మిగిలినది రబీ సీజన్‌లో వస్తుంది. అయితే, ఖరీఫ్ పంటను నిల్వ ఉంచడం సాధ్యం కాదు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్, బిహార్, గుజరాత్‌లు ఉల్లిపాయలను ఎక్కువ పండిస్తాయి.