రాజకీయాల్లోకి రావడం.. పార్టీలు పెట్టడం.. వరకు సరే! కానీ, ప్రజల్లో నమ్మకం కలిగించడం, దూసుకుపోయే నేతగా గుర్తింపు సాధించడం, ఓ భరోసా కల్పించడం అనేవి అంత సామాన్యంగా లభించేవి కావు. దేశ వ్యాప్తంగా ఏరాష్ట్రంలో చూసినా సినీ దిగ్గజాలు రాజకీయాల్లోకి వచ్చినా ప్రజల్లో విశ్వాసం ఉన్నవారే గెలుపొందారు. లేనివారు ఇంకా.. తర్జన భర్జన పడుతూనే ఉన్నారు. ఏపీ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్.. పరిస్థితి ఏంటి? ఆయన ప్రజల్లో విశ్వాసం కల్పించగలడా? అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా అవతరించింది. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం కాకపోయినా ప్రజా పోరాటం ఆగదని చెబుతున్నాడు. ఆ వెంటనే తాను సీఎం అయ్యి తీరాల్సిందేనని కూడా అంటున్నాడు.ఈ విషయంలో ఆయనకు క్లారిటీ ఉన్నా లేకపోయినా.. ప్రజలు ఆశించే కోరికలను నెరవేర్చేనాయకుడు అయి ఉంటే చాలనేది విశ్లేషకుల భావన. వాస్తవానికి వచ్చే 2019 ఎన్నికల్లోనూ ఏదొ ఒక పార్టీకి మద్దతిచ్చి తాను పక్కన ఉంటాడని పవన్‌పై కథనాలు వచ్చాయి. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్‌కు కూడా సీఎం సీటుపై మమకారం పెరిగింది. పైకి లేదులేదంటూనే తనను సీఎంగా ఎందుకు ఎన్నుకోవాలో? ఆ అవసరం ఎందుకు వచ్చిందో కూడా పూస గుచ్చినట్టు పవన్ వివరిస్తుండడం మేధావులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. సరే ఈ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే.. సీఎం అభ్యర్థిగా పవన్ ప్రజలకు నమ్మకం కలిగించగలడా ? అనేది ఇప్పుడు వెలుగు చూస్తున్న ప్రశ్న.అదేసమయంలో పవన్ తాజాగా వెలువరించిన ముసాయిదా ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన ఎక్కడా చేర్చినట్టుగా లేదు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, నిరుద్యోగులకు ఉపాధి, సంక్షేమ పథకాల ప్రస్తావన వంటివి లేకపోవడం గమనార్హం. అయితే, ఎన్నికల నాటికి వీటికి చోటు కల్పించే అవకాశం ఉందని జనసేన నేతలు ఆఫ్ దిరికార్డుగా మీడియాకు చెబుతున్నారు. కానీ, వీటిపై ఆ యా వర్గాల్లో నమ్మకం కలగించడం ఇప్పుడు పవన్ ముందున్న ప్రధాన సవాలు! ఎన్నికల వ్యూహం వేరు.. గెలవడం వేరు. పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా.. గతంలో ప్రజారాజ్యం తాలూకు అనుభవాలను చూస్తే.. కొణిదల ఫ్యామిలీకి రాజకీయాలు చేతకావనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ విడుదల చేసిన ముసాయిదాలో మహిళలకు పెద్ద పీట వేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే, రాబోయే రెండు సంవత్సరాల కాలంలో మహిళా నిరుద్యోగుల సంఖ్య ఏపీలోనే ఎక్కువగా ఉండనుందనే విషయం ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. వీరికి ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక, మహిళలపై జరుగుతున్న అకృత్యాల నుంచి వారిని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే, వీటిని పవన్ తన డాక్యుమెంట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి వాటి నిర్మాణం.. వంటివి కూడా పవన్ డాక్యుమెంట్‌లో ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఈ పరిణామాలు ఆయనపై ఏర్పడబోయే నమ్మకాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు పరిశీలకులు.