ఒంటరి మహిళపై తుపాకీ గురిపెట్టి అత్యాచారం చేసిన ఓ యువకుడు పారిపోయేందుకు యత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్ నగర్ భూపా గ్రామంలో జనవరి 31 అర్ధరాత్రి చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నితిన్ కుమార్ (25) అనే యువకుడు ముజఫ్పర్ నగర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి అక్కడి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు గట్టిగా కేకలు పెట్టడంతో నిందితుడు నితిన్ ఇంట్లో నుంచి పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఇంటి టెర్రస్ నుంచి దూకడంతో అతని కాలు విరిగింది.
గమనించిన స్థానికులు నితిన్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు రూరల్ ఎస్పీ అజయ్ సహ్‌దేవ్ వెల్లడించారు. కాగా, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు నితిన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అక్కడికి వెళ్లే సమయానికి అతని కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి మరో చోటుకు తరలించినట్టు సమాచారం. పోలీసులు నితిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.