ఐదు రోజుల పాటు తిరుమల శ్రీవారికి కొనసాగిన మహా సంప్రోక్షణ ఘనంగా ముగిసింది. సంప్రోక్షణ పరిసమాప్తమవుతున్న సందర్భంగా.. యాగశాలలోని కుంభాలతో పాటు ఉత్సవ విగ్రహాలను పూర్వపు స్థానాల్లో ఉంచారు. ఆనంద నిలయ విమానగోపురం ఉన్న స్వర్ణ కలశానికి ముందుగా సంప్రోక్షణ చేసి కుంభంతో కళా ఆవాహనం చేశారు. ఆనంతరం గర్భాలయానికి చేరుకుని శ్రీవారి విరాణ్మూర్తికి, ఉప ఆలయాల్లో, గోపుర శిఖరాల కలశాలకు కూడా కళావాహనం చేశారు. సాయంత్రం గరుడ పంచమిని పురస్కరించుకుని గరుడోత్సవం, మహాసంప్రోక్షణ ముగింపుగా పెద్దశేష వాహనసేవలు వైభవంగా ముగియడంతో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా సంప్రోక్షణ క్రతువు ముగిసినట్టయింది.తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగ శ్రీవారి మూలమూర్తికి ఇతర దేవతా పరివారానికి క్షీరాధివాస తిరుమంజనం క్రతువు ఆగమోక్తంగా నిర్వహించారు. విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేయడానికి అధివాసం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయి. ఇలాంటి విగ్రహరూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరికలు నెరవేరడంతోపాటు మానసిక శాంతి కలుగుతుంది. శాస్త్రాల ప్రకారం ఆలయ ప్రాణప్రతిష్ఠ సమయంలో క్షీరాధివాసం, జలాధివాసం, ఫలాధివాసం, ఛాయాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయనాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. మూలమూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకించడాన్ని క్షీరాధివాసం అంటారు. ‘క్షీరసాగర తరంగ శిఖర సార తరకిత చారుమూర్తే’ అంటూ ముకుందమాల స్తోత్రంలో శ్రీకులశేఖరాళ్వార్ క్షీరాధివాసం వైశిష్ట్యాన్ని తెలియజెప్పారు. అలాగే శ్రీవారి ఆలయ గోపురాల కళశాలను అద్దంలో చూపి వాటి ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. శ్రీవిమాన వేంకటేశ్వరస్వామి, శ్రీగరుడాళ్వార్, శ్రీవరదరాజస్వామి, శ్రీభాష్యకారులు, శ్రీ యోగనరసింహస్వామి, ధ్వజస్తంభం, శ్రీ బేడి ఆంజనేయస్వామి గోపురాల కలశాలకు ఈ విధంగా పవిత్రమైన జలం, పాలతో అభిషేకం చేశారు. ఇక గురువారం ఉదయం 10.16 నుంచి 12 గంటల వరకు తులా లగ్నంలో మహాసంప్రోక్షణం జరుగనుంది. ఈ సందర్భంగా యాగశాల నుంచి కుంభాలను ఆయా దేవతలు, గోపురాల వద్దకు తీసుకెళ్లి కళావాహనం చేశారు. అనంతరం ఆరాధన, నైవేద్యం, అక్షతారోపణం, బ్రహ్మఘోష, అర్చక బహుమానంతో సంప్రోక్షణం ముగిసింది. సాయంత్రం పెద్ద శేష వాహనం, గరుడ వాహనంపై స్వామివారు వేర్వేరుగా తిరుమాడ వీధుల్లో ఊరేగారు. గరుడ పంచమి రావడంతో శ్రీవారికి గరుడవాహన సేవ నిర్వహించారు. దీంతో ఈ మొత్తం క్రతువు పరిసమాప్తమైంది. కుంభం నుంచి కళను, శక్తిని మూలవర్ల విగ్రహానికి, ఆనంద నిలయంపై ఉన్న ప్రధాన కలశానికి సంప్రోక్షణ చేయడంతో మూలవిరాట్టుకు పూర్వశక్తులను అందించినట్లవుతుంది. సాయంత్రం గరుడసేవ, పెద్దశేష వాహనాలపై స్వామి తిరువీధి ప్రదక్షిణ చేస్తారు. రాత్రి యాగశాలలో చివరగా హోమాలు జరిపించి, అర్చకులకు, రుత్వికులకు బహుమానాలు సమర్పించడంతో మహాసంప్రోక్షణ ఘట్టం ముగిసినట్టయింది. మరో వైపు గురువారం అర్ధరాత్రి నుంచి దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ పునరుద్ధరించారు. శుక్రవారం నుంచి శ్రీవారికి అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. వయోవృద్ధులు, దివ్యాంగులకు, చంటిబిడ్డలతో పాటు తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం సౌకర్యం అమల్లోకి వచ్చింది