మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించింది. సావిత్రి పేరు స్ఫురణకు రాగానే ఓ నిర్మలమైన తేజోమయరూపం కనులముందు కదలాడుతుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం నుంచి నేటి వరకు అసమాన నటనకు, అద్వితీయ సౌందర్యానికి, అచ్చమైన తెలుగందానికి ప్రతీక సావిత్రి. ఆమె అభినయం గురించి ఎంత చెప్పినా చర్విత చరణమే అవుతుంది. మరి ఆ మహానటి పాత్రని పోషించడం అంటే కత్తి మీద సామే. అయినప్పటికి దీనిని ఒక దీక్షగా తీసుకొని సావిత్రి పాత్రలో అసమాన ప్రతిభ కనబరిచింది కీర్తి సురేష్. ఆమె నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. మహానటి చిత్రం ఇటు తెలుగు అటు తమిళ భాషలలో విడుదలై మంచి విజయం సాధించింది. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ ,షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బేనర్‌పై ప్రియాంక దత్, స్వప్నా దత్ నిర్మాణంలో రూపొందింది. తెలుగులో తెరకెక్కిన తొలి బయోపిక్ ఇదే కాగా, మహిళ జీవిత నేపథ్యంలో తెరకెక్కి ఇంత భారీ విజయం సాధించడం మహానటికే చెల్లింది. మే 9న విడుదలైన ఈ చిత్రం నేటితో వంద రోజుల లాంగ్ జర్నీని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేశారు. వంద రోజుల పండుగని ఘనంగా జరుపుకునేందుకు టీం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం