రాష్ట్రంలో అమరావతి, విశాఖ, తిరుపతి నగరాల్లో స్పోర్ట్స్ సిటీస్ నెలకొల్పనున్నట్లు రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రాష్ట్రంలో ఉన్న స్పోర్ట్సు అసోసియేషన్లు కేంద్ర ప్రభుత్వ స్పోర్ట్సు కోడ్ బిల్లును వచ్చే నెల 15వ తేదీలోగా అమలు చేయాలని, లేకుంటే వాటికి ప్రభుత్వమందించే సహాయ సహకారాలు నిలిపేస్తామని, గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల స్పోర్ట్సు కిట్లు అందజేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండల కేంద్రాల్లోనూ ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలను నెలకొల్పుతున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో స్పోర్ట్సు సిటీస్ నెలకొల్పుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇప్పటికే విశాఖలో 150 ఎకరాలను గుర్తించామన్నారు. రాష్ట్రంలో 10 స్పోర్ట్సు అకాడమీలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో 4 వాటర్ స్పోర్ట్సు అకాడమీలు ఉన్నాయన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రాజెక్టు గాంఢీవ ప్రారంభించామన్నారు. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 100 సెంటర్లు నెలకొల్పామన్నారు. వాటి ద్వారా లక్షా 25 వేల మంది విద్యార్థులకు వివిధ అథ్లెటిక్స్ క్రీడల్లో శిక్షణిస్తున్నామన్నారు. వారిలో ఉత్తమ నైపుణ్యం కనబర్చిన వారిని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో అంతర్జాతీయ కోచ్ లతో ప్రత్యేక శిక్షణిస్తున్నామన్నారు. 2020 నాటికి ఒలింపిక్స్ లో ఏపీకి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించామన్నారు.రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు.సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం అసోసియేషన్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో స్పోర్ట్సు అసోసియేషన్లన్నీ వచ్చే నెల 15 వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వ స్పోర్ట్సు కోడ్ బిల్లు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కోడ్ బిల్లు అమలు చేయని అసోసియేషన్లకు ప్రభుత్వమందించే సహాయ సహకారాలు నిలిపేస్తామని, గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.త్వరలో 10 వేల స్పోర్ట్సు కిట్లు అందజేయనున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలాల్లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు, పాఠశాలల క్రీడా మైదానాలు అభివృద్ధి చేయనున్నామన్నారు. గతంలో పాఠశాలలో ఉన్న క్రీడా మైదానాల అభివృద్ధికి రూ.5 లక్షల ఇవ్వగా, ప్రస్తుతం దాన్ని రూ.7.50 లక్షలకు పెంచామన్నారు. స్థల సదుపాయాలున్న చోట్ల 20 లక్షల రూపాయలతో అథ్లెటిక్ ట్రాక్ ను నెలకొల్పనున్నామన్నారు. రూ.73 లక్షలతో నియోజక వర్గ కేంద్రంలో, రూ.23 లక్షలతో మండల కేంద్రంలో ఉన్న ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రంలో మౌలిక వసతుల కల్పించనున్నామన్నారు. ఏపీలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీనిలో భాగంగా గ్రామదర్శినిలో 35 ఏళ్ల లోపు ఉన్నవారికి వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు.రాష్ట్రంలో స్కిల్ డవలప్ మెంట్ కింద ఈ ఏడాది 8 లక్షల మందికి శిక్షణివ్వనున్నామని, వారిలో లక్షా 50 వేల మందికి ప్లేస్ మెంట్ కల్పించాలనే లక్ష్యం పెట్టుకున్నామని రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్కిల్ డవలప్ మెంట్ ఏర్పాటయిన నాటి నుంచి 6.50 లక్షల మందికి వివిధ అంశాల్లో శిక్షణిచ్చామని, వారిలో లక్షా 46 మందికి ప్లేస్ మెంట్ కల్పించామని వివరించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఉపాధి అంశాలపై శిక్షణిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 425 సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉన్న లక్షా 54 మంది విద్యార్థులకు నైపుణ్య వికాసం పేరుతో శిక్షణ అందజేస్తున్నామన్నారు. అమెజాన్, ఆటో డెస్క్, గూగుల్ వంటి ప్రైవేటు సంస్థలతో కలిసి ఇండస్ట్రీస్ సర్టిఫికెట్ కోర్సులను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ కోర్సులను బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్, ఖతార్ వంటి దేశాల సాయంతో నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 40 సీమెన్స్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ అందజేస్తున్నామన్నారు. డసాల్ట్ సిస్టమ్ తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా 3 సెక్టార్లలో 84 కోర్సుల్లో శిక్షణిస్తున్నామన్నారు. ఈ ఏడాది లక్షమందికి శిక్షణివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. వాటిలో యువతకు ఉద్యోగాల కల్పనకు సదరు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. అనంతపురంలో ఏర్పాటయిన కియా మోటార్స్ యాజమాన్యం 2 వేల మంది ఉద్యోగులకు నైపుణ్య శిక్షణివ్వాలని కోరగా, అందజేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాటిలో ఆధునిక పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుందన్నారు. వ్యవసాయంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. యువతకు వ్యవసాయంలో నైపుణ్య శిక్షణకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.