YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడపపై టీడీపీ వ్యూహారచనలు

 కడపపై టీడీపీ వ్యూహారచనలు
సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై అధికార తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో జిల్లా నుండి ఒక రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అంతకు మించి విపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపజిల్లా కావడంతో ఈ జిల్లాలో రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో అధికార తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాకు సమీపంగా ఉంటున్న రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. జిల్లాలో పర్యటన సందర్భంగా కడప జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ పరిస్థితి, పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పార్టీ అధిష్టానానికి సమగ్ర నివేదిక అందినట్టు తెలిసింది. జిల్లా పర్యటనలో ఈ రెండు నియోజకవర్గాలకు సమీపంలోని బద్వేలు నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతోంది. అంతేకాకుండా రైల్వేకోడూరు నియోజకవర్గంలో కూడా వాతావరణ పరిస్థితులను బట్టి సీఎం పర్యటన ఖరారు కానుంది. కడప-రైల్వేకోడూరు హైవేలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లె సమీపంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం వాతావరణం బాగుంటేనే సీఎం పాల్గొనే పరిస్థితులున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం పార్టీ అధిష్టానానికి అందినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా పార్టీని పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి నిలిపినట్టు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ విజయం ఆధారపడి ఉందని కూడా అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీకి అండగా నేతలు అధికంగా ఉన్నా, వీరి మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఇదే పార్టీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. జిల్లా పర్యటనలో ఈ అంశంపైనే ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా తెప్పించుకున్న నివేదిక ఆధారంగా ఈ రెండు నియోజకవర్గాల్లో చర్యలు తీసుకునే పరిస్థితులున్నాయి. వర్గ రాజకీయాలకు అలవాలమైన ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ కంటే కులం, వర్గాల ప్రాధాన్యతను ఆధారం చేసుకుని తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కులం, వర్గాల ఆధారంగా చర్యలు తీసుకునే విషయంలో పార్టీ విజయం సాధిస్తే ఎన్నికల్లో పార్టీ విజయపథాన నిలుస్తుందని కూడా నివేదికలో తెలియజేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల సరళిని కూడా విశే్లషించినట్టు తెలిసింది. రైల్వేకోడూరులో ఓటమికి పార్టీ నేతల మధ్య అనైఖ్యతే ప్రధాన కారణమని పార్టీ అధిష్టానం గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల పనితీరు, పార్టీ విజయం కోసం పార్టీలో ఉన్న నేతలు ఏ విధమైన పనితీరును కనబరుస్తున్నారు అన్న దానికి కూడా పార్టీ అధిష్టానం విశే్లషించి ఓ నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో జిల్లాలో పడమటి నియోజకవర్గాలతో పోలిస్తే తూర్పు వైపున ఉన్న ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు, బాంబు దాడులు, కొట్లాటలుండవు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న అనుకూల పరిస్థితులను ఆధారంగా చేసుకుని తదనుగుణంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పార్టీ బలోపేతం చేసేందుకు దృష్టి సారించినట్టు సమాచారం. ఇటీవల ఈ రెండు నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశం కూడా పార్టీ అధిష్టానం నిర్వహించి ఉంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఈ రెండు నియోజకవర్గాల ముఖ్యనేతల నుండి కూడా పార్టీని పటిష్టపరిచేందుకు సంబంధించి పార్టీ అధిష్టానం కొంతవరకు సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీలో నేతల మధ్య సమన్వయంతో పాటు స్థానిక పరిస్థితులు, కుల ప్రభావం, వర్గ ప్రభావం ఆధారం చేసుకుని మరికొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అవసరమన్న భావనకు దాదాపుగా పార్టీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇతర పార్టీల్లో ఉన్న నేతలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం పార్టీ పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆ పార్టీ అధిష్టానం తీసుకునే చర్యలు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయన్నది వేచిచూడాలి.

Related Posts