జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న కమలం పార్టీ కోరిక ఇక తీరనట్లే. మోడీ అనుకున్నది ఇప్పట్లో జరగదని తేలిపోయింది. కేవలం ఎన్నికల కమిషన్ ఒకే ఆప్షన్ ను ఇచ్చింది. ఈఏడాది చివర్లో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలను జరపడానికి తాము సిద్ధమని, అంతే తప్ప మిగిలిన రాష్ట్రాలతో కలిపి ఒకే సారి ఎన్నికలను నిర్వహించలేమని తేల్చి చెప్పింది. దీంతో ఇక నిర్ణయం ప్రధాని మోదీయే తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల ఆలోచన. అదీ జమిలీ అయితే ఇంకా బాగుంటుందని భావించారు.జమిలి ఎన్నికలకు విపక్షాల్లో ప్రధాన పార్టీలేవీ అంగీకరించకపోవడంతో పాటు దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలన్నా తగిన సాధన సంపత్తి, సిబ్బంది లేరని ఎన్నికల కమిషన్ చేతులెత్తేసింది. ఇక మోదీ ముందున్న మార్గం ఒక్కటే. ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలకూ వెళ్లడమే. ప్రస్తుతం అందుతున్న సర్వేల ప్రకారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో బీజేపీ విజయం అంత ఈజీ కాదని తేలిపోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడిందన్న వార్తలు వస్తున్నాయి.విపక్షాలతో కలసి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందన్నది కొన్ని సర్వే సంస్థలు తేల్చాయి. బీజేపీ తాము జరిపిన అంతర్గత సర్వేలో కూడా మూడు రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్ లోనే కొంత ఛాన్స్ ఉన్నట్లు కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలకు వెళితేనే మంచిదా? లేక షెడ్యూల్ ప్రకారమే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలా? అన్న ఆలోచనల్లో కమలనాధులు ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళితే కొన్ని ఇబ్బందులు తప్పవు. మధ్యప్రదేశ్,రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో బీజేపీ ఓటమి పాలయితే వాటి ఫలితాల ప్రభావం ఖచ్చితంగా తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికలపై పడుతుందన్నది కమలనాధుల్లో కలవరం ఉన్న మాట వాస్తవమే.అదే నాలుగు రాష్ట్రాల్లో కలసి వెళితే మోదీ ప్రభావం కొంత పనిచేసి ఆ…రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశమున్నాయన్న అంచానాలో కమలం పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ లకు డిసెంబరులో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అందుకోసం ఎన్నికల కమిషన్ కసరత్తులు కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మోదీ లోక్ సభ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి పార్టీలో నెలకొంది. దీనిపై కమలనాధులు మల్లగుల్లాలు పడుతున్నారు. నాలుగు రాష్ట్రాలతో కలిసి వెళితేనే మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది. మరి మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.