ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ కనుక డిసైడ్ అయితే చంద్రబాబు కి తలపోట్లు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణాలో తెలుగుదేశం పరిస్థితి దీనాతి దీనంగా మారిన నేపథ్యంలో అక్కడి ఎన్నికలు ముందే జరిగితే ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై చూపుతుందన్న ఆందోళన తమ్ముళ్ళలో కనిపిస్తుంది. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తప్పనిసరిగా ఎదో ఒక పార్టీతో టిడిపి జట్టు కట్టి వెళ్లవలిసిన పరిస్థితి ఖచ్చితంగా వుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ లతో ఏ పార్టీతో జట్టు కట్టినా ఏపీలో విపక్షాలకు అదొక అస్త్రంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముందస్తుకు దూరంగా పూర్తి పదవి కాలం కొనసాగాలని టిడిపి భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో పదినెలల తరువాతే అసెంబ్లీ ఎన్నికలకు టిడిపి సిద్ధపడుతుంది.టి కాంగ్రెస్ తో జత కడితే ఇన్నాళ్లు ఎపికి ద్రోహం చేసి ముక్కలు చేశారంటూ చంద్రబాబు చేసిన ప్రచారమే ఆయన ప్రత్యర్థులైన వైసిపి, జనసేన లకు వరం కానుంది. కానీ సీమాంధ్ర ప్రాంత వాసులు అధికంగా నివసించే హైదరాబాద్ లో మాత్రం కాంగ్రెస్ టిడిపి కూటమికి మంచి ఫలితాలే లభించే అవకాశాలు వున్నాయి. పార్టీ స్వయంకృతాపరాధాలతో నేతలు పక్క పార్టీల్లోకి దూకేసిన టిడిపి క్యాడర్ తెలంగాణాలో చాలా బలంగా అన్ని జిల్లాల్లో నడుస్తుంది. దాంతో కాంగ్రెస్ ఈ క్యాడర్ ను వాడుకుంటే అధిక స్థానాల్లో విజయం సాధించవచ్చని లెక్కలు వేస్తుంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం పొత్తులు స్థానిక పిసిసి లు ఖరారు చేస్తాయని ముందే ప్రకటించారు కూడా. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలోనే టిడిపి తో పొత్తుకు కాంగ్రెస్ తహ తహ లాడుతుంది. కాంగ్రెస్ అయితే అవసరమైన సీట్లను టిడిపి కోరే అవకాశాలు వున్నాయి.రాష్ట్ర విభజనకు, పదేళ్ళు హైదరాబాద్ లో వుండే అవకాశం వున్నా తరలి వచ్చేలా టీఆర్ఎస్ చేసిందన్న కసి ఎపి వాసుల్లో బలంగా వుంది. అది అలా ఉంటే టిఆర్ఎస్ బలమైన టిడిపి నేతలకు ఎప్పుడో వలవిసిరింది. టాప్ క్యాడర్ అంతా ఎప్పుడో గులాబీ పార్టీలోకి జంప్ అయ్యింది .ద్వితీయ స్థాయి టిడిపి నేతలను ఎన్నికల్లో కలిపేసుకుని ఎత్తుగడలకు కార్యాచరణ మొదలు పెట్టేసింది. అందుకే గులాబీ పార్టీతో సైకిల్ పార్టీ జత కు ముందుగా టిడిపి తొందరపడాలి తప్ప టిఆర్ఎస్ కాదంటున్నారు విశ్లేషకులు. కెసిఆర్ ఇచ్చిన సీట్లే తీసుకోవాలి తప్ప డిమాండ్ చేయలేని వాతావరణం ఉందంటున్నారు. కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పడంతో తెలుగుదేశానికి గులాబీ పార్టీ దారులు మూసేసినట్లయింది. అయినా పొత్తు ప్రయత్నం తెలుగుదేశం చేస్తుందంటున్నారు. ఎవరితో పొత్తుకు వెళ్ళినా పక్క తెలుగు రాష్ట్రం జయాపజయాల ప్రభావం ఏపీ రాజకీయాలపై ప్రసరిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపి అధినేత ఎలాంటి అడుగులు ముందుకు వేస్తారో వేచి చూడాలి.