భారత్, యూకేలో పలు న్యాయ కేసులను ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత బ్యాంకుల కన్సార్టియంకు లీగల్ ఫీజుగా రూ.1.5కోట్లు చెల్లించాలని లండన్ హైకోర్టు మాల్యాను ఆదేశించింది. బ్యాంకులకు వ్యతిరేకంగా అతను నమోదు చేసిన కేసు కొట్టివేసిన అనంతరం వారి లీగల్ ఫీజులు వారికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మాల్యా భారత్‌లోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.10వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే లీగల్ ఫీజుల నిమిత్తం బ్యాంకుల కన్సార్టియంకు మాల్యా ఇప్పటికే రూ.1.8 కోట్లు చెల్లించారు. దీనికి అదనంగా మరో రూ.1.5 కోట్లు చెల్లించాలని కోర్టు తెలిపింది. దీంతో ఈ కేసులో బ్యాంకులకు లీగల్ ఫీజుల కింద మొత్తంగా రూ.3.3 కోట్లను మాల్యా చెల్లిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం మాల్యా ఇండియన్ బ్యాంక్‌లతో రాజీకి వస్తున్నారని కోర్టు తెలిసింది. 60 రోజుల్లోపు మరో 1,75,000 పౌండ్లను (1.5 కోట్లు) చెల్లించి.. ఈ కేసులో మాల్యా తుది పరిష్కారం పొందుతారని జడ్జి వాక్స్‌మ్యాన్ క్యూసీ తెలిపారు. బ్యాంకులకు డబ్బు కట్టకుండా లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాకు సంబంధించిన కేసులపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పారిపోయిన ఆర్థిక నేరస్థుల జాబితాలో మాల్యాను చేర్చాలని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆయన ఆస్తులను జప్తు చేసి వేలం వేసి బ్యాంకుల రుణాలు తీర్చాలని అనుకుంటున్నాయి. కాగా.. తాను భారత్‌కు వచ్చేందుకు, బ్యాంకులో సెటిల్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నానని ఇటీవల మాల్యా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు తన ఆస్తులను, తన కంపెనీ యునైటెడ్ 'బ్రేవరీస్ హోల్డింగ్ లిమిటెడ్' కంపెనీ ఆస్తులను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని మాల్యా ఈ ఏడాది జూన్‌లో కోర్టును కోరారు. తనకున్న రూ.13,900 కోట్ల ఆస్తులు అమ్మి అప్పులు తీరుస్తానని తెలిపారు.