భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతిపట్ల పాకిస్థాన్ ప్రభుత్వంతో సహా ఆ దేశ ప్రముఖ నేతలంతా సంతాపం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపరిచేందుకు, మార్పు తీసుకొచ్చేందుకు వాజ్‌పేయీ ఎంతగానో కృషి చేశారని పాక్ నేతలు కొనియాడారు. పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ఖాన్ వాజ్‌పేయీ మృతికి సంతాపం తెలిపారు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషిని ప్రారంభించిన వాజ్‌పేయీ, ప్రధాని అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగించారని అన్నారు. భారత్, పాక్‌ల మధ్య శాంతి నెలకొల్పడమే వాజ్‌పేయీ సాహెబ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.‘అటల్ బిహారీ వాజ్‌పేయీ మరణించారని తెలిసి ఎంతగానో చింతిస్తున్నాం’ అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ తెలిపారు. ఆయన గొప్ప నాయకుడు అని, భారత్-పాక్ సంబంధాల్లో ఎంతో మార్పు తెచ్చారని, సార్క్, రీజినల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్‌మెంట్ విషయాల్లో కీలక మద్దతుదారుగా నిలిచారని ఫైసల్ ప్రశంసించారు. వాజ్‌పేయీ, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు నిజాయితీగా శ్రమించారని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ నేత షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ గొప్ప నాయకుడిని కోల్పోయింది, కానీ ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివని తెలిపారు. రెండూ దాయాది దేశాలైనప్పటికీ పాక్‌తో శాంతి నెలకొల్పేందుకు చేసిన కృషి కారణంగా ఆయనకు పాక్‌లో కూడా అభిమానులుండడం గమనార్హం.