YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచనేతల దిగ్భ్రాంతి..

వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచనేతల దిగ్భ్రాంతి..

శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్‌ను ఒకస్థాయికి తీసుకెళ్లిన మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌, అమెరికా, రష్యా, బ్రిటన్‌, జపాన్‌ సహా సార్క్‌ దేశాధినేతలు సంతాపం తెలిపారు. భారత్‌, అమెరికా సంబంధాలు మెరుగుపరచడంలో వాజ్‌పేయీ కీలక పాత్ర పోషించారని అమెరికా గుర్తుచేసింది. ఇరుదేశాల మధ్య సహజసిద్ధ సంబంధాలు ఉన్నాయని వాజ్‌పేయీ అనేవారని దిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.భారత రాజకీయాల్లో వాజ్‌పేయీ పేరు ఓ అంతర్భాగమైందని.. ప్రపంచం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని భారత్‌లో రష్యా రాయబారి విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు అటల్‌ మంచి మిత్రుడని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. శాంతి కోసం వాజ్‌పేయీ చేసిన ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని పాకిస్థాన్‌ కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. భారత్‌, పాక్‌ సంబంధాల బలోపేతానికి విదేశాంగ మంత్రిగా పునాది వేసిన వాజ్‌పేయీ ప్రధాని అయ్యాక వాటిని కొనసాగించారని ఇమ్రాన్‌ గుర్తు చేశారు.

వాషింగ్టన్: భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణం పట్ల అగ్రరాజ్యం అమెరికా సంతాపం తెలియజేసింది. భారత్‌, అమెరికాలు చక్కని భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏనాడో గుర్తించిన నేతల్లో అటల్‌ ఒకరని అమెరికా కొనియాడింది. 2000 సంవత్సరంలోనే అటల్‌ అమెరికా కాంగ్రెస్‌ ఎదుట నిలబడి అమెరికా-భారత్‌ల మధ్య ఇరు దేశాల పరస్పర కృషితో సహజమైన భాగస్వామ్యం ఏర్పడాలని అన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు. అమెరికా, భారత్‌లు చక్కని భాగస్వామ్యం ఏర్పరుచుకుంటే అది ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికే కాకుండా ప్రపంచానికి కూడా ప్రయోజనకరం అని వాజ్‌పేయీ భావించారని, ఆయన ఆలోచనలే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు దోహదపడ్డాయని పాంపియో ప్రశంసించారు.మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా, మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంక తదితర దేశాల అధ్యక్షులు భారత రాష్ట్రపతికి సంతాప సందేశాలు పంపారు.

* భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మృతి విచారకరం. ఆయన గొప్ప నాయకుడే కాదు.. సాహిత్యం, కళల్లో మంచి స్కాలర్‌ కూడా. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మాల్దీవుల్లో పర్యటించారు. ఓ గొప్ప నేతను కోల్పోయిన భారత్‌కు మాల్దీవులు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం - మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ అబ్దుల్ గయూమ్‌

* భారత గొప్ప నేతల్లో వాజ్‌పేయీ ఒకరు. ఆయన మృతి విచారకరం. యూకే ప్రభుత్వానికి ఆయన మంచి సన్నిహితుడు- యూకే మంత్రి మార్క్‌ ఫీల్డ్‌

* వాజ్‌పేయీ ప్రపంచం గర్వించదగ్గ నేత. గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్‌, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన మృతిపట్ల సానుభూతి ప్రకటిస్తున్నాం - రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌

* ఈ రోజు ఓ గొప్ప మానవతావాదిని, నిజమైన స్నేహితుడిని మనం కోల్పోయాం. ఆయన అద్భుతమైన నాయకుడు, ప్రజాస్వామ్య రక్షకుడు - శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.

Related Posts