టీటీడీ అనుబంధ భక్తి చానల్ అవినీతి రాగం తీస్తోంది. హిందూధర్మాన్ని నలుదిశలా వ్యాప్తిచేసే ఉన్నతాశయంతో 2008లో ఈ చానల్‌ను ప్రారంభించారు. అసలు ఉద్దేశం మరుగునపడి శ్రీవేంకటేశ్వరునికి సేవ చేయడానికి బదులుగా కొందరు ఆర్థికంగా సేవ్ చేసుకునే కేంద్రంగా ఎస్వీబీసీని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ అవినీతికి సినీ దర్శకుడు రాఘవేంద్రరావు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఎస్వీబీసీ ఉద్యోగుల నుంచే వినిపిస్తున్నాయి.ఎస్వీబీసీ వార్షిక బడ్జెట్ రూ.20కోట్లు. టీటీడీ బోర్డు సభ్యుడిగా రాఘవేంద్రరావు నియమితులైన వెంటనే తన శిష్యుడు నరసింహరావును ఎస్వీబీసీ సీఈఓగా తీసుకొచ్చారు. ఆయనకు నెలకు రూ.లక్ష వేతనం కింద ఔట్‌సోర్సింగ్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. గురువు రుణాన్ని ఉంచుకోవద్దనే ఉద్దేశంతో ఎలాంటి టెండర్లు లేకుండానే కేవీఆర్, కేఆర్ఆర్ అనే ఈవెంట్స్ సంస్థలతో ఎస్వీబీసీ కార్యక్రమాలను చిత్రీకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ సంస్థలు సినీదర్శకుడు రాఘవేంద్రరావువని సమాచారం. తీసిన కార్యక్రమాలకు పేరుమార్చి మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తూ పెద్దమొత్తంలో స్వామివారి డబ్బు దుర్వినియోగం చేయడంపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈమొత్తం వ్యవహారంలో రూ.2.20 కోట్ల అవినీతి జరిగిందని తిరుపతి కాంగ్రెస్ నేత నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యంవేశారు.హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి రూ.20 కోట్ల బడ్జెట్ ఉన్న సంస్థ బాధ్యతలను ఎలా అప్పగిస్తారని మండిపడింది. ఇదే సమయంలో సీఈఓ అవినీతిపై విజిలెన్స్‌శాఖ ఆధారాలతో హైకోర్టుకు సమర్పించడంతో టీటీడీ దిగిరాక తప్పలేదు. ఎట్టకేలకు ఆయన్ను తొలగించారు. ఇది జరిగి ఆరేడు నెలలవుతోంది. తనకోసం శిష్యుడు తీసుకున్న రిస్క్ వృథా పోకూడదని రాఘవేంద్రరావు భావించినట్టున్నారు.ఎస్వీబీసీ చైర్మన్‌గా రాఘవేంద్రరావు వస్తున్నారనే ప్రచారం జరిగింది. ఎక్కడా అధికారికంగా ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఇటీవల రాఘవేంద్రరావు ప్రోద్బలంతో నరసింహరావు బినామీకి ఎస్వీబీసీ కార్యక్రమాలను తీసేందుకు ఒప్పందం జరిగిందనే ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దీనిపై ఎస్వీబీసీ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. నరసింహరావు ఇక్కడి నుంచి వెళ్లిపోయినా మరో రూపంలో స్వామివారి సొమ్మును విడిచిపెట్టడం లేదని వాపోతున్నారు.ఒకవైపు నరసింహరావుపై హైకోర్టులో కేసు నడుస్తుండగా, మళ్లీ అతనికే లబ్ధిచేకూరేలా చేయడం ఏంటనే ప్రశ్న, నిరసన సర్వత్రా వ్యక్తమవుతోంది. నరసింహరావుతో రాఘవేంద్రరావుకు సుదీర్ఘ స్నేహానుబంధం ఉండటంతో అక్రమాలకు తెరలేచిందంటున్నారు. కాని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి చెంత అవినీతికి పాల్పడటమే బాధాకరమని భక్తులు మండిపడుతున్నారు.