YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యాక్టివ్ పాలిటిక్స్ లో రెబల్ స్టార్

యాక్టివ్ పాలిటిక్స్ లో రెబల్ స్టార్
ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీకి అంతోఇంతో సినీగ్లామ‌ర్ క‌నిపిస్తోంది. మ‌రి ఇప్పుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి కూరుకుపోయిన బీజేపీకి ఇది పెద్ద‌లోటుగా మారింది. ఆ పార్టీలో ఉన్న ఒకే ఒక్క న‌టుడు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు. మ‌రి ఏపీ బీజేపీలో ఉన్న సీనియ‌ర్లు అంతా గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న త‌రుణంలో.. రెబ‌ల్ స్టార్ రాజ‌కీయ అడుగులు ఎటువైపు వేస్తార‌నే చర్చ జ‌రుగుతోంది. కొన్ని రోజులుగా పార్టీలో యాక్టివ్‌గా లేకుండా ఉన్న ఆయ‌న‌.. ఢిల్లీ వెళ్ల‌డం, నేరుగా ప్ర‌ధాని మోదీతో మంత‌నాలు జ‌ర‌ప‌డంతో పాటు ఆయ‌న‌కు నివేదిక ఇవ్వ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ నివేదిక‌లో ఏముంది? మోదీతో ఏం చ‌ర్చించారు? అనే ప్ర‌శ్న‌లు క‌మ‌ల‌నాథుల్లో వినిపిస్తున్నాయి.నామినేటెడ్ పోస్టు ఇవ్వాల‌ని కోరారా లేదా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు సిద్ధ‌మేన‌ని తెలిపారా అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ వుతున్నాయి. గ‌తంలో బీజేపీలో చ‌క్రం తిప్పిన ఆయ‌న‌.. మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అవబోతున్నార‌ని తేలింది. ఏపీ బీజేపీలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. బీజేపీ రాజకీయ వ్యవహారాల్లో ఒక వెలుగు వెలిగిన రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మ‌ళ్లీ రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా రోజులుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయ‌న‌ ఇప్పుడు ఏకంగా ప్రధానితో ఏకాంతంగా భేటీ కావడం, రాజకీయ అంశాలతోపాటు వ్యక్తిగత అంశాలను చర్చిం చడం బీజేపీలో కొత్త చర్చకు దారితీసింది. సినిమా స్టార్‌ కావడం, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం కలిసొచ్చి అప్పట్లో వాజపేయి ప్రధానిగా ఉన్న తరుణంలో కృష్ణంరాజుకు ఢిల్లీలో ఎక్కడలేని ఇమేజ్‌ వచ్చింది.నాలుగు శాఖలకు సహాయ మంత్రిగా ఆయన ఒక వెలుగు వెలిగారు. బీజేపీలో 2004లో న‌ర‌సాపురం ఎంపీగా పోటీచేసి హ‌రిరామ‌జోగ‌య్య చేతిలో ఓడిపోయారు. అక్క‌డి నుంచి ఆయ‌న‌కు క‌లిసిరావ‌డం లేదు. త‌ర్వాత చిరంజీవి స్థాపించిన పీఆర్పీలో చేరి.. రాజ‌మండ్రి ఎంపీగా పోటీచేశారు. అప్పుడు కూడా మూడో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. త‌ర్వాత మ‌ళ్లీ సొంత గూటికి చేరిపోయారు. బీజేపీలో చేరినా స్త‌బ్దుగానే ఉన్నారు. ఎక్క‌డా క‌నిపించిన దాఖ‌లాలు లేవు. ఇంతకుముందు కాకినాడ, నరసాపురం లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందిన ఆయ‌నకు ఢిల్లీ స్థాయిలో మంచి ప‌రిచ‌యాలే ఉన్నాయి. జ‌స్వంత్ సింగ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌ల ఆశీస్సులు ఉన్నాయి.దక్షిణాది నేత కావడం, సినిమా ఇమేజ్‌, అందరినీ కలుపుకుపోవడం వంటి పరిణామాలన్నీ అప్పట్లో కలిసివచ్చాయి. 2014లో మాత్రం కృష్ణంరాజు పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. బీజేపీలో చేరిన ద‌గ్గ‌ర‌నుంచి ఇప్పటిదాకా బీజేపీలోని కేంద్ర పెద్దలు కొందరితో టచ్‌లో ఉన్నారు. ఇదే తరుణంలో బాహుబలి సినిమా ఘన విజయం సాధించడం కృష్ణంరాజు ఇమేజ్‌ను మరింతగా పెంచింది. ప్రధాని కూడా బాహుబలిని చూసి ముచ్చటపడ్డారు. కృష్ణంరాజు, ప్రభాస్ లు ఇద్దరినీ అభినందనలతో ముంచెత్తారు. అయితే ప్ర‌స్తుతం ప్రత్యక్ష రాజకీయాల పట్ల కృష్ణంరాజు ఏ మాత్రం సుముఖంగా లేరని స‌న్నిహితులు చెబుతున్నారు. 2014 ఎన్నికలకు ముందుగానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, తనకు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపే విషయాన్ని పార్టీ పరిశీలించాలని తనకు తెలిసిన పెద్దల వ‌ద్ద చ‌ర్చించారు.పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. దక్షిణాది నుంచి మంచి ఇమేజ్‌ ఉన్న నాయకుడిగా మీరు న్నారు. గవర్నర్‌ గిరీ కోసం ప్రయత్నిస్తాం..వీలైతే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పదవి దక్కేలా చూస్తాం’’ అంటూ సీనియర్లు హామీ ఇచ్చార‌ట‌. కానీ నాలుగేళ్ల‌యినా హామీని నిలబెట్టుకోక‌పోవ‌డంతో కాస్త దూరంగా ఉంటున్నారు. ఒక‌వైపు చురుగ్గానే ఉంటూ మరోవైపు తన డిమాండ్‌ను కేంద్ర మంత్రుల ఎదుట వీలు చిక్కినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇదే సందర్భంలో ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయనకు మరోసారి కృష్ణంరాజు గుర్తు చేసినట్టు చెబుతున్నారు.వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో సినిమా ఇమేజ్ ఉన్న నేత‌లు కూడా బీజేపీకి కావాలి. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలు కొందరు పరోక్షంగా కృష్ణంరాజు ఎదుట ప్రస్తావించినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో మీ ఇమేజ్‌ పార్టీకి ఉపయుక్తం కావాల‌ని, ఆ దిశగా ప్రయాణం సాగాలంటూ కొందరు సూచించార‌ట‌. గవర్నర్‌ గిరీ కోసం కృష్ణంరాజు చేస్తున్న ప్రయత్నాలకు ఏ మాత్రం అడ్డు చెప్పకుండానే పార్టీ కోసం మరింతగా శ్రమ పడాలని పార్టీ నేతలు చెప్పకనే చెప్పారు.దీంతో ఏపీ రాజకీయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తే పార్టీకి లాభమో అనే విషయంపై నివేదిక రూపంలో ప్రధానికి సమర్పించినట్టు చెబుతున్నారు.

Related Posts