మాజీ ఎంపీ, ప్రముఖ సంఘ సేవకురాలు చెన్నుపాటి విద్య (84) కన్నుమూశారు. విజయవాడ పటమటలంకలోని ఆమె నివాసంలో అర్ధరాత్రి కన్నుమూశారు. ఆమె ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు (గోరా) కుమార్తె. ప్రముఖ వైద్యులు సమరంకి సోదరి. విజయనగరంలో 1934 జూన్ 5 తేదీన జన్మించిన ఆమె, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1950లో చెన్నుపాటి శేషగిరి రావుతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. విజయవాడ లోకసభ నియోజకవర్గం నుండి 1980లో మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 7వ లోకసభకు ఎన్నికైన చెన్నుపాటి విద్య, తర్వాత 1989లో రెండవసారి అదే నియోజకవర్గం నుండి 9వ లోకసభకు ఎన్నికయ్యారు. చెన్నుపాటి విద్య మృతిపై పలువురు సంతాపం ప్రకటించారు. ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా ఆమె సేవలు ప్రశంసనీయం.మహిళాభ్యుదయం కోసం ఎనలేని కృషి చేశారని అయన కొనియడారు. చెన్నుపాటి విద్య మృతి విజయవాడకే కాదు రాష్ట్రానికే తీరనిలోటుఅని అన్నారు.