ఏపీ సెట్ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం విశాఖలో విడుదల చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ ఫలితాలకు సంబంధించిన సీడీని ఆయన విడుదల చేశారు. డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు, విశ్వ విద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగాలకు ఏపీ సెట్ అర్హత కల్పిస్తుంది. 31 సబ్జెక్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33,320 మంది విద్యార్థులు ఏపీ సెట్ రాయగా.. 2,481 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు. ఈ ఏడాది 7.4 శాతం ఉత్తీర్ణత నమోదయ్యిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు, ఏపీ సెట్ కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.