ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిరోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేరళ ప్రజలకు సాయం అందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని భారత క్రీడాకారులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కొంతమంది ఆర్థిక సాయం ప్రకటించారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరదలు బీభత్సం సృష్టించాయని, 80 డ్యామ్‌ల గేట్లు ఎత్తివేశామని, ఇప్పటికే 324 మంది ప్రాణాలు కోల్పోయారని, 3లక్షల మందికి పైగా బాధితులు 1500కు పైగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ ట్వీట్ చేశారు. దీనిపై చాలా మంది భారత క్రీడాకారులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.ప్రతిఒక్కరూ తమవంతుగా మన సోదర, సోదరీమణులకు అండగా నిలవాలని కోరుతున్నారు. భారత క్రికెటర్ సంజు శాంసన్ సీఎం సహాయనిధికి రూ.15లక్షల ఆర్థిక సాయం అందజేశారు. భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, హర్భజన్‌సింగ్, హార్దిక్ పాండ్య, టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి తదితరులు కేరళవాసులకు అభిమానులు మద్దతుగా నిలవాలని, తమవంతుగా సాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాణాలను పణంగా పెట్టి సహాయ చర్యల్లో పాల్గొంటున్న ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, కోస్ట్‌గార్డ్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని ప్రశంసించారు