జనసేనలో శనివారం నాడు కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ల నుంచి సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరారు. మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తా గోపాలకృష్ణ, ఆయన పెద్ద కుమారుడు శశిధర్ పార్టీలో చేరారు. అయన దాదాపు 500 మంది అనుచరులతో కలిసి కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ లో గోపాలకృష్ణకు ప్రత్యేక స్థానం కల్పించనున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుళ్లబ్బాయి రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, టీడీపీ నుంచి మాకినేడి శేషు కుమారి కుడా జనసేనలో చేరారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముత్తా గోపాలకృష్ణ ను మనస్పూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. పార్టీలో పెద్దలు, అనుభవజ్ఞులు పార్టీకి అవసరం. ముత్తా గోపాలకృష్ణ జనసేనలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ముత్తా గోపాలకృష్ణ పై నాకు అపార నమ్మకం ఉంది. ఆయనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పిస్తున్నా. ఆయన అనుభవం పార్టీకి కావాలి. జనసేన కార్యకర్తలకు సత్ప్రవర్తన ఉంది. రాబోయేతరం వారికి ముత్తా గోపాలకృష్ణ గారి అనుభవం ఎంతో పనికి వస్తుందని అన్నారు. కాకినాడ కోసం ఆయన ఎంతో తపిస్తున్నారు. విలువలతో ఉన్న పత్రికను ఆయన నడిపిస్తున్నారు. నాపైన నమ్మకం, విశ్వాసం ఉండి జనసేనలోకి వచ్చిన ముత్తా గోపాలకృష్ణ, శశిధర్ గారికి నా హృదయ పూర్వక అభినందనలని అన్నారు. నేను ఏ మూలకు వెళ్ళినా ఎన్నో సమస్యలు ఉన్నాయని అర్ధం అవుతుంది. పార్టీకి దిశానిర్దేశం చేయాలని కోరుతున్నా. పార్టీకి అండగా ఉంటారని ఆశిస్తున్నానని అన్నారు.