శ్రీశైలం ప్రాజెక్టుకు చెందిన నాలుగు గేట్లను శనివారం ఉదయం ఎత్తివేశారు. దాదాపు 10 నెలల తర్వాత శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 880 అడుగులకు మించడంతో ఈ రోజు ఉదయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
ఉదయం 7 గం.ల సమయానికి శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 880.9 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215టీఎంసీలుగా కాగా ప్రస్తుత నీటి నిల్వ 192.969 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి వచ్చే నీటి ఇన్ ఫ్లో 3.42లక్షల క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 1,03,561 క్యూసెక్కులుగా ఉంది. మరో వైపు నాగార్జునసాగర్ డ్యాంలో నీటి మట్టం 529.9 అడుగులకు చేరింది.ప్రాజెక్టులో నీటి నిల్వ 168 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి వచ్చే నీటి ఇన్‌ఫ్లో 73,936 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 8143 క్యూసెక్కులుగా ఉంది.