టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగాను, అంతర్జాతీయ స్దాయిలోను పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాలను వెండితెరకెక్కిస్తున్నారు. వీటిలో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ నటినటుల జీవిత చరిత్రలు ఉన్నాయి. మహానటి సావిత్రి బయోపిక్ సూపర్ హిట్ కావడంతో.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల సందడి ఊపందుకుంది. తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్.టి.రామరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే తాజాగా.. వీరి జాబితాలోకి తమిళనాడు దివంగత మఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కూడా వచ్చి చేరింది. జయలలిత బయోపిక్ సినిమాను విబ్రి మీడియా పతాకంపై విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఎన్‌టీఆర్ బయోపిక్, కపిల్‌దేవ్ బయోపిక్ '83' తెరకెక్కిస్తున్నది కూడా విబ్రి మీడియానే కావడం విశేషం. జయలలిత బయోపిక్‌కు.. ‘మద్రాసపట్టణం’ అనే గొప్ప చిత్రాన్ని తీసిన ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని, తమిళం, తెలుగు, హిందీలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాను జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ బయోపిక్ సినిమాలో ఆమె సినీరంగ ప్రవేశం, రాజకీయాల్లోకి ఎదిగిన వైనం లాంటివి చూపించబోతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు జయలలిత 140కిపైగా చిత్రాల్లో నటించారు. అయితే.. జయలలిత జీవితంలో వివాదాస్పద అంశంగా మిగిలిపోయిన శోభన్‌బాబు ఎపిసోడ్‌కు సంబంధించి ఈ సినిమాలో ప్రస్తావన ఉంటుందో లేదో చూడాలి మరి..