గత అనుభవం దృష్ట్యా తాము ఏ జాతీయ పార్టీని నమ్మలేకపోతున్నామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కాబోయే ప్రధాని మోదీనా? లేక రాహుల్ గాంధీనా? అనేది తమకు అనవసరమని... ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే, వారినే బలపరుస్తామని చెప్పారు. ఏ పార్టీ అయినా సరే ముందు అధికారంలోకి వచ్చి... ప్రత్యేక హోదాను ప్రకటిస్తే, వారికి మద్దతు తెలుపుతామని అన్నారు. వాస్తవానికి వైసీపీ ఎవరి పక్షాన లేదని... అంశాలవారీగానే తాము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించామని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ మేరకు స్పందించారు.
రాజ్యాంగబద్ధమైన పదవులకు ఎన్నికలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎన్డీయే తరపున రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు పలికామని జగన్ తెలిపారు. ఇదే విధంగా ఏపీ స్పీకర్ పదవికి నామినీ అయిన కోడెలకు కూడా మద్దతిచ్చామని చెప్పారు. భూసేకరణ బిల్లు విషయంలో బీజేపీని తాము వ్యతిరేకించామని గుర్తు చేశారు