YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                                       సర్గ-13

                                   అశ్వమేధయాగం ప్రారంభం      

 సంవత్సరాంతంలో యజ్ఞాశ్వం తిరిగి రావడంతో, యాగం ఆరంభించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యజ్ఞాశ్వం మరలివచ్చేటప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు శాస్త్రంలో చెప్పినట్లే చేయాలి. మొదటి సంవత్సరం గుర్రాన్ని స్వేచ్ఛగా తిరిగేందుకు విడిచిన తర్వాత, అది విహరించేందుకు, దాని సంరక్షణార్థం నూర్గురుచొప్పున రాజపుత్రులను-ఉగ్రరాజులను-సూతగ్రామణులను-క్షత్తసంగ్రీహతలను దానివెంబడే పంపాలి. గుర్రాన్ని వారు మరలించకూడదు. అది తిరుగుతూ-తిరుగుతూనే తుదకు తనకుతానుగా గృహానికి మరలిరావాలి. అలానేవస్తుందికూడా. వచ్చిన వెంటనే, బ్రహ్మ, అధ్వర్యుడు, హోత, ఉద్గాత అనిపిలువబడే నలుగురు ఋత్విక్కులు దానిని రథకారుడి ఇంటిలో బంధించి, దానినాలుగుపాదాలపై మంత్రాలుచెప్తూ హోమం చేస్తారు. అశ్వ విసర్జన సంవత్సరంలో పదకొండు నెలలు గడచిన తర్వాత దానిని, అక్కడనుండి తరలించి, సదస్సు వద్దకు తెచ్చి, మళ్ళీ అక్కడ అశ్వత్థప్రజంలో బంధిస్తారు. పన్నెండో నెల యజ్ఞానికి కావాల్సిన సామానులను తెచ్చుకొని, కడపటి ఫాల్గుణ అమావాస్య నాడు ఋత్విక్కులతో యజ్ఞశాలలో ప్రవేశించి, రెండవ సంవత్సరం మొదటిరోజు పాడ్యమినుండి మొదలుపెట్టి అశ్వమేధయాగం ప్రారంభిస్తారు. అది మొదలు ఏడు రోజులు శాస్త్రోక్తంగా ఇరవై ఒక్క హోమాలు జరుపుతారు. సోమ ప్రయోగంలో భాగంగా, ఇంద్రుడు దేవతగా గల అయిదు హవిస్సులను (దానం, కరంభం, పరివాపం, పురోడాశం, నయస్య) ప్రాతస్సవనమున ఇంద్రుడిగూర్చి హోమం చేయాలి. మాద్యందినసవనమున, సాయంసవనమున నయస్య తప్ప ఇతర హోమాలను చేయాలి.                                                      
ఈ విధమైన కార్యక్రమాలను ఋషి పుత్రుడైన ఋశ్యశృంగుడు-ఇతర బ్రాహ్మణులు ఏ విధమైనటువంటి కొరత రానీకుండా నిర్వహించారు. హోమం చేసేటప్పుడు, చేజారిపడిందికానీ-చేయవలసినదాంట్లో లోపంకానీ, దేనిలోనూ జరగలేదు. అన్ని కార్యాలు సమంత్రకంగా, విఘ్నం లేకుండా జరిగిపోయాయి. సరదాకోసమైనా ఎవరుకూడా ఆకలనికానీ-దప్పికనికానీ అనలేదు. వేదవిద్యరాని బ్రాహ్మణుడుకానీ-శిష్యులుకానీ ఎవరూలేరక్కడ. అక్కడకొచ్చిన బ్రాహ్మణులు-సేవకులు-పిల్లలు-ముసలివారు-రోగపీడితులు-స్త్రీలు, రకరకాల పిండివంటలు-పప్పులు-అన్నం, ప్రీతిగా కడుపునిండా భుజించారు. మనోహరమైన ఆ భక్ష్యాలు ఎంతో రుచికరంగా వుండడంతో, జిహ్వ చాపల్యంతో ఇంకా-ఇంకా తినాలని వున్నా, కడుపులో ఖాళీ లేనందున, లేవడానికి మనసు లేకపోయినా, లేవకతప్పలేదు. 
పప్పులు, అప్పచ్చులు, అన్నం, నేతి వెల్లువలు, రుచిగలపాయసం లాంటి వంటలు భోజనశాలంతా వ్యాపించి వుండడంతో, అక్కడంతా బురద నేలలాగా అనిపించింది. ఎక్కడెక్కడినుండో వచ్చిన స్త్రీ-పురుషులు వంటకాల రుచులను మరీ-మరీ పొగడుకుంటూ తనివితీరా తిన్నారు. దశరథుడు యజ్ఞం చేసినన్ని రోజులూ, ప్రతిదినం, ఏపూటకాపూట కొత్త కొత్త వంటకాలు గుట్టలు-గుట్టలుగా కనిపించాయక్కడ. తృప్తిగా-కడుపునిండా అతిధులందరూ దశరథుడికి శుభం పలుకుతుంటే సంతోషించిన ఆయన భోజనానంతరం ప్రతి వారికీ వస్త్రాలు-ఆభరణాలు దానం చేసాడు. భోజనం చేస్తున్న బ్రాహ్మణులకు వడ్డించిన వారు-వారికి సహాయకులుగా వున్నవారూ, శుచిగా-శుభ్రంగా, మంచిదుస్తులుధరించి వుండడంతో తినే వారందరూ తృప్తిపడ్డారు. ఇక మాకు అప్పచ్చులొద్దు-పాలొద్దు-పెరుగొద్దు-కడుపులు నిండాయి-తృప్తిపడ్డాం, అన్నంతవరకు వడ్డన జరుగుతూనే వుంది. భోజనానంతరం ఒకరిమీద ఇంకొకరు పందెం వేసుకుంటూ, హేతువాదం చేయసాగారు బ్రాహ్మణులు. ఎందుకంటే,దశరథుడి సభలో,వ్రతాలుచేయనివారుకాని,వాదనలో అసమర్థులుకానీ, ఆరంగాల వేదాధ్యయనం చేయనివారు కానీ, పెద్దలసేవచేసి విషయాలను గ్రహింపనివారుకానీ ఒక్కరుకూడాలేరు కనుక.
యూపస్తంభ ప్రతిష్ఠ                                                                                                
ఔపవసత్థ్యదినాన అశ్వాలంభమనే కార్యాన్ని జరిపించేందుకు యూపస్తంభ (యజ్ఞ పశువును కట్టివేయాల్సిన స్తంభం) స్థాపన జరగాలి. యూపస్తంభాలు నాటే సమయం రాగానే, మారేడువి ఆరు, చండ్రవి ఆరు, మోదుగువి ఆరు నాటారు మొదలు. అగ్నిని వుంచే తిన్నె (వేది) సమీపంలో ఒక ’విరిగి కట్టె’ స్తంభాన్ని నాటారు. దానికి ఇరు పక్కల ఒక్కో ’దేవదార’ స్తంభాన్ని నాటారు. స్తంభాల అలంకరణకొరకు బంగారుసొమ్ములుంచారు. మొత్తం ఇరవై ఒక్క స్తంభాలను నాటి వస్త్రాలతో అలంకరించారు.కల్పంలో చెప్పిన విధంగానే,చక్కగా తీర్చబడి-ఎనిమిది వైపులా మెరుగులుండేరీతిలో నున్నగా శిల్పులు సిద్ధంచేశారు వాటిని. అందుకే అవన్నీ శోభాయమానంగా కనిపించాయి. చందనం పూసిన వస్త్రాభరణాలతో అలంకరించిన ఆ యూపస్తంభాలు ఆకాశంలో సప్తర్షులలాగా ప్రకాశించాయి. శాస్త్రంలో చెప్పిన విధంగానే, అందులో సూచించిన కొలతలుగల ఇటుక రాళ్లను తెచ్చి "శుల్బ" మనే పనిలో నైపుణ్యమున్న బ్రాహ్మణులు అగ్నినుంచే తిన్నె (వేది) ను కట్టారు. అది గరుడి ఆకారంలో, బంగారు రెక్కలతో, మూడంతలుగా-పద్దెనిమిది ప్రస్తారాలుగా, ప్రకాశించింది. ఆ తర్వాత శాస్త్రోక్తంగా దైవ ధ్యానం చేసుకుంటూ, మూడువందల పక్షులను-పశువులను-జలజంతువులను కట్టారు. అటు పిమ్మట, కౌసల్య అశ్వానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, మూడు బంగారు సూదులతో గాట్లుచేసింది అశ్వానికి. ఒక రాత్రంతా గుర్రం సమీపంలో పడుకుంది ధర్మంగా. తర్వాత దశరథుడు బ్రహ్మకు-హోతకు-అధ్వర్యునకు-ఉద్గాతకు, మహిషిని-వావాతను-పాలాకలిని-పరివృత్తిని, దానంగా ఇచ్చాడు. ఋత్విజుడప్పుడు "వపను" మంత్రోక్తంగా అగ్నిలో హోమం చేయడంతో, దశరథుడు, శాస్త్రోక్తంగా తగిన సమయంలో దాని వాసన చూసాడు. (వపాధూమవాసన పాప హారమని భారతంలో చెప్పబడింది). 
పదహారు మంది బ్రాహ్మణులు అశ్వానికి చెందిన ఒక్కొక్క అంగాన్ని తీసుకొని, మంత్రోక్తంగా అగ్నిలో వేసి హోమం చేసారు. ఇతర యజ్ఞాలలో హవిస్సును "రావి" సమిధలతో పాకం చేయగా, అశ్వమేధంలో "ప్రబ్బలి" సమిధలతో పాకం చేయాలి కనుక అలానే చేసారు. బ్రాహ్మణములలో అశ్వమేధం మూడురోజులు చేయాలని చెప్పారు. మొదటిరోజు చతుష్టోమం, రెండవ రోజున ముక్త్యం, మూడోనాడు అతిరాత్రం అనే కార్యాలను చేయాలని చెప్పబడింది. అలానే చేసిన ఋత్విక్కులు అదనంగా ఇతర శాస్త్రోక్త కార్యాలైన జ్యోతిష్టోమం, ఆయురధ్వరం, అతిరాత్రం, అభిజిత్తు, విశ్వజిత్తు, నప్తోరామ్యం కూడా జరిపించారు. 
ఈవిధంగా యజ్ఞం పూర్తవగానే, హోతకు తూర్పుదిక్కునవున్న రాజ్యాన్ని-అధ్వర్యునకు పశ్చిమదిక్కునవున్న రాజ్యాన్ని-బ్రహ్మకు దక్షిణ రాజ్యాన్ని-ఉద్గాతకు ఉత్తరదిక్కునవున్న రాజ్యాన్ని, ఇక్ష్వాకు కులవర్ధనుడైన దశరథుడు దానంగా ఇచ్చాడు. యజ్ఞం పూర్తి కావించి, తనరాజ్యాన్నంతా నిర్మల మనస్సుతో ఋత్విజులకు దానమిచ్చిన దశరథుడిని చూసి, నిష్కాములమైన తమకెందుకీ రాజ్యమని వారంటారు. ప్రయోజనంలేని రాజ్యానికి మారుగా కొన్ని గోవులను, రత్నాలను, కొంత బంగారాన్ని ఇస్తే చాలని కోరుతారు వారు. సరేనన్న దశరథుడు, వారుకోరినవిధంగానే, వెయ్యివేల గోవులను-పదికోట్ల స్వర్ణాలను-దానికి నాలుగురెట్ల వెండి నాణాలను ఋత్విజులకు ఇచ్చాడు. వారవన్నీ తీసుకుని వశిష్ఠుడికి-ఋశ్యశృంగుడికి ఇవ్వగా, ఎవరెవరికి ఎంత భాగం రావాల్నో, అంతే ఇచ్చి వారిని పంపారు ఆ ఇద్దరు. యజ్ఞం చూసేందుకొచ్చిన లోకులందరూ సంతోషించే విధంగా, బంగారు నాణాలు-రత్నాలు-సాలువలు, లెక్క లేనన్ని దానం చేసాడు దశరథుడు. తుదకొక నిరుపేద బ్రాహ్మణుడు అడిగితే, తనచేతి కడియాలను కూడా దానం చేసాడు. దానం గ్రహించిన వారంతా సంతోషపడి, భక్తి గౌరవాలతో చేతులు జోడించి, పవిత్రుడైన దశరథ మహారాజును నిండుగా-దయతో దీవించారు.
ఇతర రాజులెవరికీ సులభంకానిదీ, శ్రేష్ఠమైనది, సర్వ పాపాలను హరించేదీ, స్వర్గ ప్రాప్తిని కలిగించేదీ అయిన అశ్వమేధ యాగాన్ని చేశానన్న సంతోషంతో-ప్రీతితో దశరథుడు, ఋశ్యశృంగుడిని చూసి: " నీ కరుణవల్ల అనిష్టపరిహారమైన అశ్వమేథయాగాన్ని చేసాను. ఇక ఇష్ట ప్రాప్తైన సంతాన లాభం అనుగ్రహించడానికి నీవే సమర్థుడవు. అది చేయించి నన్ను ధన్యుడిని చేయుము" అని ప్రార్థించాడు. దానికి సమాధానంగా ఋశ్యశృంగుడు దశరథుడు చేయాల్సిన పనిని వివరించాడు. 
                                                                             రేపు తరువాయి భాగం...

Related Posts