భారత జట్టు సమష్టి ఆటతీరుతో మూడో టెస్టులో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తోంది. బౌలర్లకు దీటుగా బ్యాట్స్‌మెన్ కూడా రాణిస్తుండడంతో విజయాన్ని ఖాయం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసేసరికి తమ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 31 ఓవర్లలో రెండు వికెట్లకు 124 పరుగులు చేసింది. ధవన్ (44) రాణించాడు. క్రీజులో పుజారా (33 బ్యాటింగ్), కోహ్లీ (8 బ్యాటింగ్) ఉన్నారు. సోమవారం తొలి సెషన్‌లో వీలైనంత వేగంగా ఆడి ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే ఆలోచనలో భారత్ ఉంది. అంతకుముందు హార్దిక్ పాండ్యా (5/28) బౌలింగ్‌లో చెలరేగగా ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 168 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. బట్లర్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 94.5 ఓవర్లలో 329 పరుగుల వద్ద ముగించింది.