సర్గ-14
పుత్ర కామేష్టి చేసిన దశరథుడు
సంతాన లాభం అనుగ్రహించమని వేడుకొనిన దశరథుడితో ఋశ్యశృంగుడు, ఆయన కోరిన విధంగానే జరుగుతుందని అంటాడు. కీర్తికి స్థానాలైన నలుగురు కొడుకులు ఆయనకు కలుగనున్నారనీ, విచారించ వద్దనీ అంటూ, తదేక ధ్యానంతో కొంచం సేపు ఆలోచిస్తాడు. దశరథుడికి కొడుకులు పుట్టేందుకు అధర్వణమంత్రాలతో యాగాన్ని చేయిస్తానంటాడు. అధర్వణ మంత్రాల ప్రకారం అగ్నిహోత్రుడిని ఉద్దేశించి హోమం చేయిస్తే తనకు కొడుకులు పుడతారని ఋశ్యశృంగుడు చెప్పిన మనోరంజకమైన మాటలను విన్న దశరథుడు సంతోషించి యజ్ఞానికి పూనుకుంటాడు. యజ్ఞం చేస్తున్న సమయంలో, అక్కడకు, గంధర్వులు-దేవతలు-సిద్ధులు-ఇతర దేవతలు, పరమఋషులు, తమతమ హవిర్భావంకొరకై బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. వచ్చిన వారంతా బ్రహ్మను చూసి, రావణాసురుడు తమను పెట్తున్న బాధలను ఆయనకు మొర పెట్టుకుంటారు.
రావణుడు పెట్టే బాధలను బ్రహ్మతో విన్నవించుకున్న దేవతలు
"నమస్కారం చేసిన ప్రతివాడికి స్వాధీనుడవయ్యే బ్రహ్మదేవా! నీ దయను పరిపూర్ణంగా పొందిన రావణాసురుడు, బ్రహ్మ వర బలంతో తననెవ్వరూ-ఏమీ చేయలేరని, గర్వంతో మమ్ములను బాధలకు గురిచేస్తున్నాడు. భుజబలంతో వాడినెదిరించి యుద్ధం చేసే సమర్థత మాకు లేదు. పోనీ, ఎలాగైనా వాడిని చంపుదామంటే, దేవతలవల్ల వాడికి చావు లేకుండా నీ విచ్చిన వరాన్ని మేము గౌరవించి, వాడిని చంపకుండా విడిచిపెట్టి, వాడి చేతిలో చెప్పరాని బాధలు పడుతున్నాం. వాడు మమ్మల్నే కాదు-ముల్లోకాలను మనోవ్యాకులంతో హాహా కారాలు చేసే విధంగా దుష్టుడుగా బాధిస్తున్నాడు. ఇంద్రుడిని స్వర్గంలో లేకుండా చేసే ప్రయత్నంలో వున్నాడు. నీ విచ్చిన వర బలంతో వసువులను, వ్రతులను, బ్రాహ్మణులను, యక్షులను చికాకుపరస్తున్నాడు. ఇది చేయొచ్చు-అది చేయకూడదని లేకుండా, వాడు చేసేవన్నీ చెడ్డపనులే. రావణాసురుడికి భయపడి సూర్యుడు వేడి కలిగించకుండా చంద్రుడి మాదిరి చల్లబడ్డాడు. వాయుదేవుడు వీచడం మానేశాడు. సముద్రుడు శుష్కించి భయంతో కదలడం లేదు. ఇక వాళ్ళ గతే అలావుంటే, మా సంగతి చెప్పేందుకేముంటుంది? వీడు బలహీనపడి జగాలన్నీ రక్షించబడే మార్గం లేదా?" అని దేవతలందరూ బ్రహ్మను వేడుకుంటారు.ఇలా తనను ప్రార్థించిన దేవతలతో, రావణాసురుడిని చంపే ఉపాయం తోచిందని సంతోషంతో అంటాడు బ్రహ్మ. దేవలతచేత, యక్షులచేత, దైత్యులచేతా, విద్యాధరులచేత, వసువులచేతా, ఆకాశ సంచారులచేత చావు లేకుండా మాత్రమే రావణాసురుడు తనను వరం కోరాడని, అంతకంటే తక్కువ వారైన మనుష్యుల చేతిలో చావు లేకుండా వరం కోరలేదనీ అంటాడు బ్రహ్మ. మనుష్యులు దుర్బలులనీ-వారికంటే వానరాదులు మరింత దుర్బలులనీ, వారు తననేమీ చేయలేరనీ అలక్ష్యంగా మాట్లాడాడు. కాబట్టి వాడి చావు మనిషి చేతిలో రాసిపెట్టి వుందని అంటాడు బ్రహ్మ సంతోషంగా. ఆవిధంగా బ్రహ్మ చెప్పగానే, రావణ వధకు ఉపాయమైతే దొరికింది కాని, వాడిని చంపగల మనిషెవ్వరని-ఎవరిని తాము ఆశ్రయించాలని ఆలోచనలో పడ్డారు దేవతలందరూ.
దేవతలకు ప్రత్యక్షమైన శ్రీ విష్ణుమూర్తి
దేవతలు తమను రక్షించేవాడెవరోనని తెలుసుకొనేలోపలే, శిష్టులను రక్షించేందుకు, దుష్టులను శిక్షించేందుకు, ధర్మాన్ని స్థాపించేందుకు, దశరథుడి అభీష్ఠాన్ని నెరవేర్చేందుకు, పరమ కరుణాలుడైన భగవంతుడు భూలోకంలో అవతరించదలచి దేవతలున్నచోటికే వచ్చాడు. భగవంతుడు, ఎప్పుడు దేవతలు తనను శరణుకోరుతారా-ఎప్పుడు వారిని రక్షించాలా, అని ఎదురుచూస్తున్న విధంగా ఆయనే వారిని వెతుక్కుంటూ వచ్చాడని దీనర్థం. యాచించిన తర్వాత యాచకుల కోరిక నెరవేర్చడం ఉత్తమ లక్షణం కాదనీ, తనను శరణుజొచ్చిన వారికట్టి శ్రమ కలిగించకూడదని, భగవంతుడే స్వయంగా వచ్చాడు. అయితే, సర్వజ్ఞుడైన భగవంతుడికి, రావణుడి విషయం తెలియదా అన్న సందేహం రావచ్చు. తెలిసికూడా వాడు పెట్టే బాధలనుండి దేవతలను ఎందుకు కాపాడలేదు? ఎవరైనా తమను తాము రక్షించుకుంటామన్న ధైర్యం వున్నంతవరకు, స్వప్రయత్నం చేస్తున్నంతవరకు, దైవ సహాయం అందదు. దైవమే పరమ గతి-దైవ సహాయం లేని పురుష ప్రయత్నం వ్యర్థమని ఎప్పుడు భారం భగవంతుడిపైన వేస్తారో అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. మనం భగవంతుడికెదురుగా పది అడుగులేస్తే ఆయన పదికోట్ల అడుగులు వేసి మనను చేరుకుంటాడు. ఇది అనివార్య విధి. దేవతలు రక్షకుడిని కోరుకున్నప్పుడే భగవంతుడికి తెలిసిపోయింది. ఆశ్రిత రక్షణకు సిద్ధమయ్యాడు . కాంచనచేలుడు, జగన్నాయకుడు, శుభకరమైన దేహకాంతికలవాడు, శంఖ చక్ర గధ భయ ముద్రలతో మనోహరమైన వాడు, విష్ణుమూర్తి ఆవిధంగా దేవతలున్నచోటుకు వచ్చాడు. వచ్చిన విష్ణుమూర్తి ఏకాగ్రమనస్సుతో బ్రహ్మ సమీపంలో వుండగా, దేవతలాయనకు నమస్కరించి, స్త్రోత్రం చేసి, ఆయన మనస్సును సంతోషపరచి, భక్తితో తమ బాధలు చెప్పుకున్నారు.
"కమలాలలాంటి కళ్ళున్న మహానుభావా! ఆపదలతో బాధపడుతున్నాం. నిన్ను ప్రపత్తి చేసినవాళ్ళం. అందుకే నిన్నే ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని-ప్రపంచాన్ని దయతో రక్షించు. ప్రపంచంలో సత్ప్రవర్తనకలవాడని ప్రసిద్ధికన్నవాడు, మంచి కీర్తి సంపాదించినవాడు, దాత, ఋషితేజంకలవాడు, కకుత్థ్స వంశంలో పుట్టినవారిలో శ్రేష్ఠుడు దశరథుడు కొడుకులు కావాలని సంకల్పించి యజ్ఞం చేస్తున్నాడు. దశరథుడికి భూదేవి-శ్రీదేవిని పోలిన ముగ్గురు భార్యలున్నారు. వారికి నువ్వు నాలుగు రకాలైన కొడుకులుగా జన్మించాలి. నువ్వు మనుష్యుడివిగా జన్మించి, చెడుతలంపులు కలవాడుగా లోకాలను బాధిస్తూ-భుజబలంతో అతిశయిస్తూ-దేవతలందరి చేతిలో కూడా చావులేనివాడుగావున్న, రావణాసురుడిని సంహరించాలి. ఎందుకు చంపాలంటే: వాడు, లోకాలకు మేలుచేసే సిద్ధులను-సాధ్యులను-దేవతలను-మౌనులను, బాధిస్తున్నాడు." అని దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకున్నారు.
విష్ణువుతో తమ సంకటాలను విన్నవించుకున్న దేవతలు
"జగన్నాయకా! మునీశ్వరులు సంధ్యవార్చే సమయంలో ప్రాణాయామం చేస్తుండగా, రాక్షసులు మీదపడి ముక్కు-చెవులు కోస్తున్నారు. ఆకాశంలో దేవతలు విమానాలలో కూర్చొని తిరగాలనుకుంటే, రాక్షసులు ఆ విమానాలను విరిచి కుప్పలు చేస్తున్నారు. గంధర్వులు హాయిగా పాడదామనకుంటే,స్వరమాలాపించగానే గొంతులు పిసుకుతున్నారు. యజ్ఞం చేద్దామనుకున్నవారికి ఆ ఆలోచనే రాకూడదు. దేవతా స్త్రీలు వీధుల్లోకి పోతే వారి మానం పోయినట్లే. దేవతలెవరూ నందనవనానికి విహారానికి పోకూడదు. దేవతలు యజ్ఞాలకు హవిస్సుకై పోరాదు. మనుష్య స్త్రీలెవరూ అలంకరించుకోరాదు. లక్ష్మీవల్లభా! మా దుఃఖాలనేకం. రాక్షసుల బారిన పడకుండా దాగివుండేందుకు మరుగు స్థలాలే లేవు. అలాంటి దుష్ట చరిత్రుడైన రావణుడిని వధించి మమ్మల్ని కాపాడు. దేవతలకు విరోధైన రావణాసురుడిని వధించేందుకు భూలోకంలోకి పోయేందుకు సంకల్పించు" మని దేవతలు విష్ణుమూర్తికి మొర పెట్టుకుంటారు.
దేవతలకు అభయమిచ్చిన విష్ణుమూర్తి
బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ తాము పడే కష్టాలను తెలియచేయడంతో, మహావిష్ణువు వారితో, దుఃఖ పడవద్దని, తానా దుష్ఠరాక్షసులను నాశనం చేస్తానని, వారికి కలిగిన ఆపదను తొలగిస్తానని, శుభం కలిగిస్తానని అభయమిస్తాడు. రావణాసురుడిని, వాడి కొడుకులతోనూ – మంత్రులతోనూ – మనుమలతోనూ - దాయాదులతోనూ – చుట్టాలతోనూ – మిత్రులతోనూ - వాడికి తప్పుడు పనుల్లో తోడ్పడేవారితో నూ, ప్త్రేరేపించేవారితోనూ - వాడిని కూడి పనిచేసేవారి తోనూ కలిపి సంహరిస్తానని హామీ ఇస్తాడు. శరణు చొచ్చిన వారినేకాక-వారి ఆప్తులను, అనుకూలురను ఎలాకాపాడుతానో, అలానే దుష్టులను వారి కొమ్ము కాసేవారినీ దండిస్తానని అంటాడు భగవంతుడు. దయా హీనుడై భూత హింస చేసేవారిని-పరులను బాధించకుండా లోక క్షేమమే కావించే మునులను, దేవతలను భయపెట్టేవారిని, ఇతరులెవరూ-ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయకుండా సత్ప్రవర్తన కలిగుండేలా, రావణాది రాక్షసులను యుద్ధభూమిలో సంహరిస్తానని అభయమిస్తాడు విష్ణుమూర్తి. ధర్మాన్ని ఉపదేశమూలంగానేకాకుండా, అనుష్ఠానపూర్వకంగా తెలిపేందుకు, పదకొండేళ్లు భూమి మీదుండి ధర్మాన్ని స్థాపిస్తానని-అట్లాచేస్తే, భగవంతుడిని శరణువేడినవారికి, వారు కోరినదానికంటే ఎక్కువ ఫలమే దక్కుతుందని లోకానికి తెలియచేస్తానని దేవతలతో అంటాడు విష్ణువు. శరణాగతులైన బ్రహ్మాది దేవతలందరికీ, భయం పూర్తిగా పోయే విధంగా, అభయహస్తమిచ్చిన విష్ణుమూర్తి, తాను మనుష్యుడిగా ఎవరికి జన్మించాలనీ-ఆ యోగ్యత ఎవరికున్నదనీ ఆలోచించాడు. తామరాకులలాంటి విశాలమైన నేత్రములున్న వాడు, పాప సంహారుడు, నమస్కారం చేసే ప్రజలను రక్షించాలన్న ఆసక్తిగలవాడు, వంచన లేనివాడైన భగవంతుడు తనకు తండ్రి కాగల అర్హుడు అయోధ్యాపురాధిపతైన దశరథుడేనని తలచాడు.
(కౌసల్యా-దశరథుల పూర్వజన్మ వృత్తాంతం: స్వాయంభువ మనువు, పూర్వం, గోమతీ తీరాన వున్న నైమిశారణ్యంలో, వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, మూడు జన్మల్లో నారాయణుడు తనకు పుత్రుడుగా వుండాలని అడుగుతాడు. అంగీకరించిన భగవంతుడు, ఆయన దశరథుడిగా పుట్టినప్పుడు "శ్రీరాముడు" గా పుత్రుడయ్యాడు. యదువంశంలో వసుదేవుడిగా మనువు పుట్టినప్పుడు "శ్రీకృష్ణుడు" గా ఆయనకు పుత్రుడయ్యాడు. మూడోజన్మలో "శంబళ గ్రామం" లో-కలియుగంలో-నాలుగోపాదంలో, హరివ్రతుడనే బ్రాహ్మణుడికి "కల్కి" గా పుట్టగలడు. మనువు భార్య సుశీల, కౌసల్య పేరుతో దశరథుడికి, దేవకి పేరుతో వసుదేవుడికి, దేవప్రభ పేరుతో హరివ్రతుడికి భార్యగా వుండి, మూడు జన్మల్లొ విష్ణుమూర్తికి తల్లి అవుతుంది. శంబళ-సంబళ-శంభళ-సంభల అనే రూపాంతరాలు కూడా శంబళ గ్రామానికున్నాయి. భారతంలో హరివ్రతుడికి విష్ణుశర్మ అన్న పేరుంది.). అలా దశరథుడి కొడుకుగా, నాలుగు ఆకారాల్లో పుట్టాలని భగవంతుడు ఆలోచన చేస్తుంటే, ఆయన అభిప్రాయం తెలుసుకున్న శివుడు-ఇతర దేవతలు, రాక్షసుల శత్రువైన విష్ణువును స్త్రోత్రం చేస్తారు. తమకెవ్వరికీ సాధ్యపడని వాడైన రావణాసురుడిని-మునీశ్వరులను నిగ్రహించువాడిని-దేవతా సమూహాలను మొర్రో అనిపించేవాడిని, వధించమని, పరమకరుణాకరుడైన శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తారు. "సేనలతోనూ-బంధువులతోనూ రావణుడిని చంపి, మాలాంటివారికి లభ్యంకానిదీ-ప్రాకృతదోషరహితమైనదీ-అనిత్యమైన స్వర్గ సత్య లోకాలవలె కాకుండా నిత్యమైనది, అయిన నీ లోకంలో ఇన్ని అవతారాలెత్తినప్పటికీ సంసారులను తరించే మార్గం చెప్పలేకపోతినే-వారికి సరైన మార్గం చూపలేకపోతినేనన్న మనస్తాపం వదలి, మనం చేయాల్సిన పని చేసాం-బుద్ధిమంతుల్ని రక్షించాం-బాగుపడాల్సిన వారికి మార్గం చూపాం, అన్న సంతోషంతో రండి" అని భగవంతుడిని అర్థిస్తారు దేవతలు.
రేపు తరువాయి భాగం...