కథానాయికగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి.. ప్రతీ ఏటా ఏదో ఒక భాషలో తన సినిమాలతో సందడి చేసింది చెన్నై చిన్నది త్రిష. అయితే గతేడాది మాత్రం.. ఆమె చేతినిండా సినిమాలున్నా కొన్ని కారణాల వల్ల ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సకాలంలో విడుదలకి నోచుకోలేకపోయింది. అయితే, ఈ సంవత్సరం మాత్రం తక్కవ గ్యాప్‌లోనే ఐదు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమైంది ఈ సొగసరి. ‘మోహిని’, ‘గర్జనై’, ‘సదురంగవేట్టై 2’, ‘1818’, ‘96’.. ఇలా త్రిష నటించిన ఐదు సినిమాలు ప్రస్తుతం విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ముందుగా అరవింద్ స్వామికి జోడీగా నటించిన ‘సదురంగవేట్టై 2’ రాబోతోంది. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా విడుదల కాబోతోందని చెన్నై సమాచారం. ఇక ‘మోహిని’, ‘గర్జనై’ చిత్రాలు ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి కూడా.
ఇదిలా ఉంటే..తాజాగా బాలా శిష్యుడు వర్నిక్ దర్శకత్వంలో సినిమా చేయడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నటి సురభి కూడా కీలకపాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ‘కుట్రపయిర్చి’ అనే టైటిల్ ఖరారు చేశారు. 1980లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో...త్రిష గూఢచారిగా కనిపించనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని శ్రీ గురుజ్యోతి ఫిలిమ్స్ బ్యానరుపై వివేకానందన్ నిర్మిస్తున్నారు. రథన్ సంగీతమందించనున్నాడు.