- దక్షిణాఫ్రికా తీర జలాల్లో ట్యాంకర్ నౌక గల్లంతు
- ఆందోళనలో భారతీయ నావికుల కుటుంబాలు
ముంబై నావికా సంస్థకు చెందిన 22మంది భారతీయ నావికులతో వెళ్తున్న ఎం.టి. మెరైన్ ఎక్స్‌ప్రెస్ అనే ట్యాంకర్ నౌక దక్షిణాఫ్రికా తీర జలాల్లోని బెనిన్‌లో హైజాక్‌కు గురైనట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా 8.1 మిలియన్ డాలర్ల విలువ గల గ్యాసోలిన్ తీసుకెళ్తున్న ట్యాంకర్ నౌక దక్షిణాఫ్రికా సముద్ర జలాల్లో 48 గంటలుగా సంబంధాలు తెగిపోవడంతో జాడ తెలియక తీవ్ర ఆందోళనను రేకిత్తిస్తోంది. కొన్ని నెలల్లో ఇదే ప్రాంతంలో ఎం.టి. మెరైన్ నౌక అదృశ్యం కావడం ఇది రెండోసారి. మెరైన్ ఎక్స్‌ప్రెస్ నౌకను ఒకవేళ హైజాకర్లు హైజాక్ చేశారా లేదా సముద్ర దొంగలకు చిక్కిందా అనే దానిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతనెల 31న ఎం.టి మెరైన్ ఎక్స్‌ప్రెస్ నౌకతో సాయంత్రం 6.30 గంటల తరువాత నుంచి సంబంధాలు తెగిపోయాయి. మరుసటి రోజు తెల్లవారుజామున 2.36 గంటల ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ గునియా నుంచి నౌక కనిపించకుండా పోయింది. ఈ ట్యాంకర్ నౌకలో 13,500 టన్నుల గ్యాసోలిన్ ఉందని షిప్పింగ్ పరిశ్రమకు చెందిన అధికారులు వెల్లడించారు. ఒక్కో టన్ను గ్యాసోలిన్ 600డాలర్లు ఉంటుందని.. మొత్తం నౌక విలువ దాదాపు 8.1మిలియన్ డాలర్లు (సుమారు రూ.52కోట్లు) ఉంటుందని అంచనా వేశారు. గ్యాసోలిన్ దొంగిలించడానికి సముద్ర దొంగలు దాడి చేసే అవకాశం ఉందని లేదా హైజాక్ చేసే అవకాశాలూ చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అదృశ్యమైన ట్యాంకర్ నౌకను కనిపెట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్), ఢిల్లీలోని షిప్పింగ్ ఆఫ్ మినిస్టరీ ఇప్పటికే పొరుగుదేశాలైన నైజేరియా, బెనిన్ నావికా అధికారులను కోరింది. ఈ నౌక పనామా దేశంలో రిజిస్టర్ కాగా, నౌకలోని 22 మంది సిబ్బంది భారతీయులు ముంబయిలోని అంధేరీ తూర్పు ప్రాంతంలోని ఎం/ఎస్ ఆంగ్లో ఈస్ట్రన్ షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన సిబ్బందిగా అధికారులు పేర్కొన్నారు.