కేరళ వరదల విపత్తుపై అంతర్జాతీయంగా స్పందన వ్యక్తం అవుతోంది. బాధితులను ఆదుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. కేరళ వరదల బాధితుల కోసం వాటికన్‌లో నిన్న ప్రత్యేక ప్రార్థనలు కూడా జరిగాయి. ప్రార్థనలు మాత్రమే కాకుండా.. సాయం చేసే చేతులు కూడా ముందుకు వస్తున్నాయి. కుండపోత వర్షాలతో అతలాకుతలం అయిన కేరళకు దాదాపు 35 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది ఖతార్. వరదలతో నిరాశ్రయులు అయిన వారి కోసం 34.89 కోట్ల రూపాయల మొత్తాన్ని ఖతార్ సాయంగా అందించనున్నట్టుగా ‘గల్ఫ్ టైమ్స్’ పేర్కొంది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన అమీర్ షేక్ బిన్ హమద్ అల్ థానీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిపింది. ఇక యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారతీయ వ్యాపారులు కూడా కేరళ కోసం భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. కేరళలో జన్మించి యూఏఈలో సెటిలైన లులు గ్రూప్ అధినేత యూసఫ్ అలీ ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. ఫాతిమా హెల్త్ కేర్ గ్రూప్ చైర్మన్ కేపీ హుస్సేన్ ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు, మిగతా మొత్తాన్ని శరణార్థుల సహాయానికి అందించనున్నారు. యూఏఈలోని యునిమొని సంస్థ చైర్మన్ బీఆర్ షెట్టి రెండు కోట్ల రూపాయలు, ఆస్టెర్ డీఎం హెల్త్ కేర్ చైర్మన్ అజాధ్ మూపెన్ యాభై లక్షల రూపాయల మొత్తం విరాళాన్ని ప్రకటించారు. మొత్తంగా యూఏఈ నుంచి పన్నెండున్నర కోట్ల రూపాయల విరాళం ప్రకటన వచ్చింది. ఇంకా గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన అనేక మంది తమ వంతుగా స్పందిస్తున్నారు.