ఏపీ నూతన రాజధాని అమరావతికి ఏనాటికైనా వరద ముప్పు తప్పదా అంటే అవుననే సమాధానం వస్తోంది. నూతన రాజధాని నిర్మాణానికి స్థల ఎంపికలోనే పాలకుల దూరదృష్టి కొరవడిందని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడి ఏకపక్ష వైఖరి భావి తరాలకు భారీ నష్టం కలిగించే ప్రమాదం లేకపోలేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని నిర్మాణం చేపట్టే ఉద్దేశంతో నాటి యూపీఏ ప్రభుత్వం స్థల ఎంపికకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి శివరామకృష్ణన్ చైర్మన్‌గా నియమించింది. ఈయన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మాజీ కార్యదర్శి. ఈయనతో పాటు కమిటీలో సభ్యులు ఆయా రంగాల్లో ప్రసిద్ధులు. సభ్యులుగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ పాలసీ డైరెక్టర్ డాక్టర్ రతిన్‌రాయ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగన్‌షా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ అరోమార్ రవి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ ప్రొఫెసర్ రవీంద్రన్ ఉన్నారు.ముఖ్యంగా రాజధాని స్థల ఎంపికలో ఈ కమిటీ కొన్ని ముఖ్యమైన అంశాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకొంది. ప్రధానంగా పంట సాగు భూములకు తక్కువ నష్టం కలిగించడం, పర్యావరణాన్ని కాపాడటం, స్థిరంగా కొనసాగాల్సిన అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రకృతి బీభత్సాల ప్రమాదాన్ని అంచనా వేయడం, నిర్మాణ ఖర్చును తక్కువ స్థాయిలో ఉంచడం, భూసేకరణను సాధ్యమైనంత వరకు తక్కువ చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలనుకొంది.ఎంతోమంది నిపుణులతో కూడిన కమిటీకి చంద్రబాబు ప్రభుత్వం సహకరించక పోగా, టీడీపీ వ్యాపారస్తులైన నారాయణ, సుజనాచౌదరి, గల్లా జయదేవ్ తదితరులతో కొత్త కమిటీని రాజధాని స్థల ఎంపికకు అధ్యయనం పేరుతో వేశారు. ముందే అమరావతి పేరు ప్రచారంలోకి వచ్చింది. శివమరాకృష్ణ కమిటీ నివేదిక బుట్టదాఖలైంది.శివరామకృష్ణ కమిటీ నివేదికలో అమరావతిని వరద ముప్పు ప్రాంతమని హెచ్చరించింది. అక్కడ రాజధాని నిర్మాణం ఏ మాత్రం సరైంది కాదని హెచ్చరించింది. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో మూడు పంటలు పండించే సారవంతమైన భూమి. కృష్ణానదికి సమీపంలో నూతన రాజధాని ప్రాంతం ఉంది. దీనివల్ల భూగర్భ జలాలు పైన్నే ఉంటాయి. వర్షపు నీరు ఇంకిపోయే అవకాశాలు తక్కువ. దీంతో వరద వచ్చే ప్రమాదం ఉంది. 1986లో భారీ వరద వచ్చి తీవ్రనష్టం సంభవించింది.అందులోనూ రాజధాని ప్రాంతంలో కొండవీటివాగు ప్రవహిస్తోంది. ఇది ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. కొండవీటివాగుకు వరదొస్తే కృష్ణానదిలో కలపడానికి ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఉండవల్లి వద్ద ప్రభుత్వం లిప్ట్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నిర్మాణం మూడు, నాలుగు నెలల్లో పూర్తికావలసి ఉంది. ఒకవేళ వరద వస్తే నీటిని కృష్ణానదిలోకి పంపి, రానప్పుడు కెనాల్‌లో నావిగేషన్ సిస్టం పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్షం పడితే సచివాలయంలోకి నీళ్లు వస్తున్నాయి.ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గదిలో నీళ్లు లీక్ కావడంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేరళలో జలప్రళయం చేస్తున్న విధ్వంసాన్ని కళ్లారా చూస్తున్నాం. ప్రకృతి విపత్తులను అడ్డుకునే శక్తి మన యంత్రాంగానికి ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఒక్క తప్పు, ఒక్కరి స్వార్థం... భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా పాలకులు ఆలోచించి రాబోవు తరాల శ్రేయస్సు కోసం ప్రకృతి విపత్తులకు ఆస్కారం లేని రాజధానిని నిర్మించాల్సి ఉంది.