సర్గ-15
మానవ అవతారం ఎత్తమని విష్ణువును ప్రార్థించిన దేవతలు
తనను ప్రార్థించిన సిద్ధులను-దేవతలను-అమరులందరినీ ఆదర బుద్ధితో-గౌరవంగా, తనకు తెలిసినప్పటికీ, వారిద్వారా విందామన్న భావంతో, రావణుడిని చంపే ఉపాయం చెప్పమని అడుగుతాడు శ్రీమన్నారాయణుడు. తమనా విధంగా పెద్దలను చేసి, గౌరవించి, సలహా అడిగినందుకు, మహాతేజవంతుడు-భగవంతుడు-కార్యం ఏవిధంగానైనా నెరవేర్చగల సమర్థుడు-మహానుభావుడు, అయిన ఆయన ఔదార్యాన్ని, గొప్ప గుణాన్ని, మరీ-మరీ తలచుకుంటూ ఆయనకు మ్రొక్కి, నరుడి ఆకారంలో జన్మించి రావణుడిని చంపమని ఉపాయమిస్తారు.
(దేవతల ప్రార్థన ప్రకారం దశరథ పుత్రుడై వున్నప్పుడు, దైవం లాగా వుండాల్నా-మనుష్యరూపంలో వుండాల్నా అన్న ప్రశ్నను దేవతలనే అడిగాడు నారాయణుడు. అది వారికి ఆయన ఇచ్చిన గౌరవం. వారు చెప్పబోయేది తాను అప్పటికే నిశ్చయించుకున్నప్పటికీ, ఎదుటివారి గౌరవార్థం, వారి మనస్సును పరీక్షించేందుకు, ఆవిధంగా ప్రశ్నించడం రామావతారంలో ఒక విశేష గుణం. ఇదే లక్ష్మణ-భరత-విభీషణుల రక్షా విషయంలో కనిపిస్తుంది. లోకులందరూ ఈవిషయాలు తెలుసుకోవాలి. నారాయణుడు సర్వాంతర్యామి-సర్వాధారుడు. ఇంతటి గొప్పవాడు దేవతల ఇష్టానుసారం చేయడమంటే, ఆశ్రిత పారతంత్ర్య గుణం అర్థమవుతోందిక్కడ. అదేవిధంగా, తమనొక పెద్దను చేసి, అడిగినపుడు, తగిన రీతి తమకు తోచినది తప్పో-ఒప్పో చెప్పకపోతే, ఆదరించినవారిని నిరాకరించినట్లవుతుంది కాబట్టి, తమకు తోచింది చెప్పదలచారు-చెప్పారు)
"అనేక సంవత్సరాలు రావణాసురుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేసాడు. తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మను, లోకాలన్నింటినీ బాధపెట్టేందుకు, తనకెవరిచేతిలో మరణం లేకుండా వరంకోరాడుకానీ, మనుష్యులను లక్ష్యపెట్టలేదు. వాడడిగిన వరమిచ్చాడు బ్రహ్మ. రావణుడు వర గర్వంతోఅన్నిలోకాలవారిని-ముఖ్యంగా వయసులో వున్న స్త్రీల మాన ప్రాణాలను-పురుషుల ప్రాణాలను నాశనం చేసాడు. వాడు మనిషి చేతులో తప్ప ఇతరులకు చావడు. సామాన్య మానవులెవరు వాడిని చంపలేరు. అందువల్ల నీవే మానవావతారంలో వాడిని చంపాలి" అని చెప్తారు దేవతలందరూ.
దశరథుడికి పాయసం ఇచ్చిన ప్రాజాపత్య పురుషుడు
దేవతలిచ్చిన సలహాను "సరే" నని అంగీకరించిన మహావిష్ణువు అదృశ్యమయ్యాడు. అదిలా వుండగా మరోవైపు దశరథుడి పుత్రకామేష్ఠి యాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అలా కొనసాగుతుండగా, అగ్నిహోత్రం మధ్యనుండి ప్రాజాపత్య మూర్తి దర్శనమిస్తాడు. ఆయన దర్శనమిస్తున్న సమయంలో అగ్నిహోత్రం నడుమనుండి, తేజస్సొకటి దిక్కులన్నీ వెలుగులందించేటట్లు - చూసేవారికి దిగ్భ్రమ కలిగించేటట్లు - నలుపు,ఎరుపు కలిసిన వస్త్రం ధరించి, రక్త వర్ణం ముఖంతో, దుందుభిలాంటి కంఠీరవం కలిగున్న ఆకారం కనిపించింది. నునుపైన సింహం మెడమీదుండే వెంట్రుకలలాంటి వెంట్రుకలు-ప్రకాశిస్తున్న మీసాలు-శుభ చిహ్నాలు-శుభకరమైన సొమ్ములు-కొండలాంటి ఉన్నతమైన దేహం-మదించిన వ్యాఘ్రం లాంటి పరాక్రమం-సూర్య తేజస్సు-మండుతున్న అగ్ని తేజస్సు-గొప్ప వీర్యం-అధికమైన బలం కలిగి, భుజంమీద దివ్యపరమాన్నం వున్న బంగారు పాత్రతో బయట కొచ్చిన ప్రాజాపత్య మూర్తి దశరథుడితో ఆయన్ను చూడటానికి వచ్చానని అంటాడు.
తననేమి చేయమంటాడో తెలియచేయమని-శలవివ్వమని, దశరథుడు ఆ మహాశక్తిని వేడుకుంటాడు. జవాబుగా: " సంతానం కోరి నీవు యజ్ఞం చేస్తుంటే, దేవతలందరూ సంతోషించి నన్ను పంపిస్తే వచ్చాను. దేవతలచే నిర్మితమైనది-ఇతరులకు లభించనిది-సంతాన కారణమైంది-ఆరోగ్యకరమైంది-మేలుకలిగించేది-నిన్ను ధన్యుడిని చేసేదయిన ఈ పాయసాన్ని తెచ్చాను. దీనిని తీసుకో" మని పుణ్యాత్ముడైన దశరథుడితో అంటాడు ప్రాజాపత్య మూర్తి. దశరథుడు ఆ పాయసాన్ని తనకిష్ఠమైన భార్యలకు-తనకు గల గుణచేష్టాకీర్తులలో తగినవారని తోచిన వారికి, దయతో ఇమ్మని చెప్తాడాయన. దశరథుడు కోరినట్లే కొడుకులు పుట్తారని కూడా చెప్పగా విని సంతోషిస్తాడు. దేవతలు అనుగ్రహించినది-దివ్య పాయసాన్నంతో నిండినదైన బంగారు పాత్రను దశరథుడు తీసుకొని, శిరస్సున ధరించి, ప్రాజాపత్య పురుషుడికి ప్రదక్షిణ చేసి, భక్తితో నమస్కరించాడు.
నిరుపేదకు గొప్ప నిక్షేపం దొరికినట్లు దశరథుడు సంతోషించాడు. దివ్య పురుషుడు అదృశ్యమయ్యాడు. అంతఃపురంలోని దశరథుడి భార్యలు-స్త్రీలందరు, ఈవార్తవిని, చంద్రమండలంలోని ఆకాశ కాంతిలాగా సంతోషించారు. దశరథుడు తన భార్యలుండే చోటికి పోయి (యజ్ఞ శాల వద్దనే వున్న ప్రత్యేక స్థలం) పట్టపు దేవైన కౌసల్యతో సంతోషంతో జరిగిన విషయాన్నంతా చెపుతాడు.
(ప్రాజాపత్య పురుషుడిచ్చింది క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఇంద్రుడి స్వాధీనంలో వున్నటువంటి అమృతం కాదు. భగవంతుడి తేజస్సు మనుష్య స్త్రీ గర్భంలో ప్రవేశించేందుకు మంత్రవంతమైన హవిస్సులాంటి - నిమిత్తమాత్రమైన పదార్థం ఒకటి కావాలి. అదే, భగవత్తేజః పూరితమైన పాయసాన్నం. అదే అమృతమైతే, తాగిన స్త్రీలకు మరణం రాదు కదా! అందుకే, శ్రీరామాది జననములు "రేతస్సర్గం" కారణం కాదనీ-వారి దేహాలు అప్రాకృతాలనీ తెలుసుకోవాలి. అదే దశరథుడు కనుక తాగుంటే, వచ్చిన గర్భాలకు రేతస్సంబంధం కలపొచ్చు. అలాంటిది జరగలేదు. శుక్ల రక్త సంయోగాలవలన ఏర్పడే దేహాలకు స్త్రీ గర్భవసతి అవశ్యంకాని, దివ్య తేజస్సుతో ఏర్పడేవాటికి స్త్ర్రీ గర్భవసతితో పనిలేదు. దీనికి ఉదాహరణలుగా, మాంధాతృ జననం, కుంభజులైన అగస్త్య-వశిష్ఠ-ద్రోణాచార్య జననం, ధృష్ట్యద్యుమ్న-ద్రౌపది జననం చెప్పుకోవాలి. ఇందు క్షేత్రం ప్రధానం కాదు-గర్భస్థజీవుడే తన తపో బలంతో, స్వేచ్ఛాత్తశరీరుడవుతాడు. వీరి దేహాలు తల్లి తినే ఆహారంతో కాని-తల్లి సంకల్పంతో కాని సంబంధం లేదు. అంటే, తల్లితండ్రుల జాతికి, బిడ్డలజాతికి సంబంధం లేదిక్కడ. కట్టెల్లో పుట్టిన అగ్నిహోత్రుడిది ఏజాతి? తాను లోగడ ఇచ్చిన వరం తీర్చేందుకు-కౌసల్యా దశరథులకు పుత్రమోహం కలిగించేందుకు, భగవంతుడు పన్నిన పన్నాగమే ఇది. అందుకే, ఈ రహస్యాన్ని తెలిసిన విశ్వామిత్రుడు శ్రీరాముడిని సంబోధిస్తూ, "దశరథ పుత్రా" అని కాని-"కౌసల్యా పుత్రా" అనికాని అనకుండా, "కౌసల్యా సుప్రజారామ" అన్నాడు. స్వేచ్చానుసారం-స్వతంత్రంగా-కారణాంతరాలవల్ల, తపోబలంతో కారణజన్ములైన మహాత్ముల జన్మలకు, పామరుల జన్మలకు పోలికేలేదు. వాల్మీకి చెప్పినట్లు, శ్రీరాముడిని "సాక్షాత్తు విష్ణువు" అని మునులందరు నమస్కరించారు కాని, క్షత్రియుడని జాతి వివక్షత చూపినట్లైతే నమస్కరించక పోయేవారు).
భార్యలకు పాయసాన్ని పంచి ఇచ్చిన దశరథుడు
తాను తెచ్చిన పాయసం గురించి చెప్తూ దశరథుడు కౌసల్యతో:" ఇది పుత్రోత్పత్తికి కారణమై-జన్మాన్ని పావనం చేసేదై-అమృతంతో సమానమైన పాయసం. దీన్ని పూజించు. ఇది నువ్వు తీసుకుంటే కొడుకు కలుగుతాడు" అని ప్రేమతో అంటాడు. సూర్యవంశంలో జన్మించి, నీతిమంతుడుగా పేరొందిన దశరథుడు, ప్రాజాపత్యపురుషుడిచ్చిన పాయసంలో సగం మొదలే కౌసల్యకిచ్చాడు. ఆమె దాన్ని తాగింది. మిగిలిన సగంలో సగం (పాతిక భాగం) రెండో భార్యైన సుమిత్రకు ఇచ్చాడు. తక్కిన పాతిక భాగం ఎవరికిస్తారో చూద్దామనుకున్నది సుమిత్ర. ఆమె అభిప్రాయం గ్రహించిన దశరథుడు, సుమిత్రతో సమానంగా కైకకు ఇవ్వడం ధర్మంకాదనుకొని, మిగిలిన పాతిక భాగాన్ని రెండు భాగాలు చేసి, ఒకభాగం కైకకు, మరో భాగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. కైక తనకిచ్చిన పావులో సగభాగాన్ని-సుమిత్ర తనకు రెండు సార్లు ఇచ్చిన రెండు భాగాల్ని(వేరు-వేరుగా) తాగారు.
(పాయసం పంచడంలో దశరథుడు, భార్యలలో పెద్ద-పిన్న తరం ఆలోచించాడు. అందరికన్నా పెద్దభార్య-పట్టపుదేవి కౌసల్య. రెండోది సుమిత్ర. మూడవ భార్య కైకేయి. కాబట్టి పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చాడు మొదలే. తక్కిన సగభాగంలో రెండవ భార్య సుమిత్రకు సగం తొలుత ఇచ్చాడు. ఇంకో సగం కైకేయికిస్తే, సుమిత్రను-కైకేయిని సమానంగా చూసినట్లవుతుందనీ-అది ధర్మంకాదనీ, నయజ్ఞుడైన దశరథుడు ఆలోచించి, మిగిలిన పాతిక భాగంలో సగం కైకేయికి-సగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. కైకేయి అందరికన్నా చిన్నదైనందున "పరక" పాలిచ్చాడు. ఆవిధంగా, సగం కౌసల్యకు-పాతిక ఒకసారి, పరక ఒకసారి సుమిత్రకు-పరక కైకేయికి ఇచ్చాడు. కైకేయి సంభోగ విషయంలో ప్రియురాలు కాని న్యాయంగా భాగంలో కాదు దశరథుడికి. ఇలా తారతమ్యం లేకపోయినట్లైతే, పెద్ద-చిన్న గౌరవం పాటించనట్లు అవుతుంది. ధర్మదృష్టి చేసిన భాగ పరిష్కారం కనుకనే, రాజపత్నులు సమ్మతితో స్వీకరించారు. దశరథుడికి ధర్మాత్ముడని పేరొచ్చింది అందుకే. ఇకపోతే: రామచంద్రమూర్తి విష్ణువు అర్థాంశం. లక్ష్మణుడు పాదాంశం. భరత-శత్రుఘ్నులు ఇరువురుకలసి పాదాంశం. తనకు న్యాయంగా రావలసిన భాగం దశరథుడు తనకీయగానే కౌసల్య పాయసాన్ని తాగింది-ఆకారణం వల్ల ఆమె కొడుకు తొలుత జన్మించి జ్యేష్ఠడయ్యాడు. సుమిత్ర తాగకుండా మొదలు ఊరుకుంది. తనకు న్యాయంగా భాగమొచ్చిందనుకున్న కైకేయి కూడా వెంటనే తాగడంతో, ఆమె కొడుకు రెండవవాడు గా పుట్టాడు. పాతిక-పరక వేర్వేరుగా ఆఖరున తాగిన సుమిత్రకు కవలలు చివరలో జన్మించారు).
కొడుకులు కలిగేందుకు దశరథుడు ధర్మమార్గాన్ననుసరించి, పెద్ద-పిన్న గౌరవం ఆలోచించి, పాయసం పంచుతే, రాజపత్నులు సంతోషించారు. అలా సంతోషంతో పాయసం తాగిన తర్వాత కౌసల్య-సుమిత్ర-కైకేయిలు దుస్సహములైన సూర్యాగ్ని తేజస్సుతో-దేవతల క్షేమానికి కారణం కాగల-రావణాసురుడి చెరసాలలో బంధించబడిన దేవతా స్త్రీల కాలి సంకెళ్ళను తొలగించగల సామర్థ్యమున్న గర్భాలను ధరించారు. ఆ ఉత్తమ స్త్రీ రత్నాలను చూసిన కమల బాంధవుడైన సూర్యతేజస్సువంటి తేజస్సుకలవాడు-శత్రువులను సంహరించడంలో సమర్థుడు-ఇంతకాలం కొడుకులు పుట్తారా అని వ్యాకులపడ్తున్నదశరథుడు, ఇనుమడించిన సంతోషంతో, సిద్ధులు-దేవతలు పూజించే ఇంద్రుడిలాగా వెలిగాడు.
రేపు తరువాయి భాగం...