పదవుల పంపకాల నేపధ్యంలో జనసేన నేతల మధ్య వివాదాలు ముసురుకుంటున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ కేంద్రంలోనే నేతల మధ్య సఖ్యత కొరవడిందని తెలుస్తోంది. జనసేనను నమ్ముకున్న వారికంటే ఇతర పార్టీ ల నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేస్తుండడం దానికి కారణంగా తెలుస్తోంది. అదే సమయంలో ఒకే సామాజికవర్గానికి పెత్తనం కట్టబెడుతుండటం మిగినవారికి నచ్చడం లేదని సమాచారం. పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండానే కొందరు నేతలు చక్రం తిప్పుతున్నారేమోనన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జనసేనలో ఇప్పటికే నేతల మధ్య శిబిరాలు కొనసాగుతున్నాయని సమాచారం. వైసీపీ నుంచి వచ్చి చేరిన తోట చంద్రశేఖర్ తన అనుచరులను పార్టీలో చేర్చుకుంటూ కీలక పదవులు కట్టబెడుతున్న తరుణంలో మిగిలిన నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారనే విమర్శల వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న మారిశెట్టి రాఘవయ్య వంటి వారికి తగిన గుర్తింపు దక్కడం లేదనే వాదన కూడా మొదలైంది. అదే సమయంలో జిల్లా స్థాయిల్లో పార్టీ కన్వీనర్ పదవులు కూడా దాదాపుగా కాపు సామాజికవర్గానికే కేటాయించడంతో జనసేనపై కులముద్ర ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గుంటూరు నుంచి విశాఖ వరకూ అన్ని జిల్లాల్లోనూ కోఆర్డినేటర్ పదవులు అదే సామాజిక వర్గానికి కేటాయించడం దానికి ఉదాహరణగా పేర్కంటున్నారు.అదే సమయంలో దిగువ స్థాయి పదవుల్లో కూడా జనసేన కోసం కష్టపడిన నేతలను పక్కన పెట్టేస్తుండడంతో పలువురు నిరాశకు గురవుతున్నారట. నాలుగేళ్లుగా జనసేన పిలుపులు అమలు చేస్తున్న వారిని కాదని, ఇటీవలే పార్టీలో చేరిన వారికి పదవులు కేటాయిస్తున్న వైనం వారి ఆగ్రహానికి కారణంగా నిలుస్లోందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే జనసేనలో అప్పుడే వర్గపోరు ఉధృతమవుతుందనే సంకేతాలు వెలువడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం కన్నా ప్రచారానికే ప్రాధాన్యతనిస్తున్న పవన్ వ్యవహారం చాలా సమస్యలకు మూల కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనకు తెలియకుండానే కొందరు నేతలు పలు వ్యవహారాలు నడుపుతున్నారనే వాదన వినిపిస్తోంది. జనసేనలో తీవ్రమవుతున్న వివాదాలు ఆపార్టీకి ఇబ్బందికరంగా మారనున్నాయని విశ్లేషకుల అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే త్వరలో మరింత మంది నేతలు చేరే అవకాశం ఉన్నందు పవన్ జోక్యం చేసుకుని, ఇటుంటి వివాదాలను నియంత్రించాలని పలువురు సూచిస్తున్నారు.