తిరుమలేశుని వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పవిత్రోత్సవాల్లో వెంకన్న స్వామి ఉభయనాంచారులతో సర్వసుందరంగా అలంకృతమై తిరుమాడవీధుల్లో ఊరేగారు.అనంతరం సర్వాభరణాలు, పుష్పమాలలతో ఉత్సవరులను అందంగా అలకరించారు. ఈ సందర్భంగా ఉత్సవరులు విమాన ప్రదక్షిణ చేసి ఆలయ ప్రవేశం చేశారు.శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు సోమవారం అంకురార్పణం జరిగింది. రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారు పల్లకినెక్కి ఆలయం నుంచి ఊరేగింపుగా వసంత మండపానికి వేంపుచేశారు. ఇక్కడ పుట్టమన్ను సేకరించి ప్రదక్షిణంగా ఆలయం ప్రవేశం చేశారు. అనంతరం ఆలయంలో అంకురార్పణ, ఆస్థానం జరిగింది. పవిత్ర మండపంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. పవిత్రోత్సవాల అంకురార్పణం శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య రుత్విక్‌వరణం కార్యక్రమం నిర్వహించారు. రుత్విక్‌వరణంలో భాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తులు వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. తిరుమలలో పవిత్రోత్సవాలు 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి, అనంతరం 1962లో ఈ ఉత్సవాలను పునరుద్ధరించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరిరోజు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను రద్దు చేశారు. పవిత్రోత్సవాలను దోష నివారణ, సర్వయజ్ఞ ఫలప్రద, సర్వదోషోపశమన, సర్వతుష్టికర, సర్వకామప్రద తదితర పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల ప్రకారం స్వామివారి ఉత్సవమూర్తులకు అవసరమైన పవిత్రాలను చేయడానికి శ్రేష్ఠమైన పత్తి మొక్కలను అత్యంత పవిత్రంగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరడులో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం లేదా 200 మూరల నూలుదారం ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఆలయ మొదటి ప్రాకారంలోని వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. ‘పవిత్ర తిరునాల్’ పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరల వివరాలున్నాయి.