వివాదాస్పద నటి శ్రీరెడ్డి అనుకున్నది సాధించింది. ఎట్టకేలకు ముఖానికి రంగు వేసుకుని సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆమె స్వీయ చరిత్రను సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించింది. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో ప్రచారంలోకి వచ్చిన శ్రీరెడ్డి.. టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ.. వాళ్లతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం శ్రీరెడ్డి లీక్స్ పేరుతో తన ఫోకస్‌ను టాలీవుడ్ నుండి కోలీవుడ్‌కి షిప్ట్ చేసి తమిళ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. లారెన్స్, మురుగదాస్, సి. సుందర్, హీరో శ్రీరామ్‌లు అవకాశం కావాలంటే సెక్సువల్‌గా కాంప్రమైజ్ కావాలని అడిగారంటూ తీవ్రస్థాయిలో అలిగేషన్స్ చేసింది శ్రీరెడ్డి. అప్పటి నుండి చెన్నైలోనే మకాం వేసిన శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. ‘రెడ్డి డైరీ’ పేరుతో పరిశ్రమలో తనకు ఎదురైన పరిస్థితుల్ని తెరపై ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది శ్రీరెడ్డి. ఈ సందర్భంగా చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ‘రెడ్డి డైరీ’ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
అమ్మ జయలలిత గారి ఆశీస్సులతో తమిళంలో నా మొదటి చిత్రాన్ని లాంఛ్ చేస్తున్నాను. ఈ చిత్రానికి ‘రెడ్డి డైరీ’ పేరును ఖరారు చేశాము. చిత్రై సెల్వన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రవి దేవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అంటూ ఫేస్ బుక్‌లో ‘రెడ్డి డైరీ’ విశేషాల్ని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఈ చిత్రంలో తనను అవకాశాలకోసం సెక్సువల్‌గా వాడుకున్న వారి ఒరిజినల్ వీడియోలు చూపించబోతున్నామంటూ సంచలన ప్రకటన చేసింది శ్రీరెడ్డి. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి.. ‘రెడ్డి డైరీ’ బయోపిక్ ద్వారా రసిక రాజుల బండారం బయటపెట్టబోతున్నట్టుగా ప్రకటన చేయడంతో ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగుతున్నాయి.