రైతులకు ఆదాయ కల్పనలో కీలకంగా ఉన్న పశు సంరక్షణకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. పశువులతో పాటు గొర్రెలు, మేకలకు ఎప్పటికప్పుడు వ్యాధుల నివారణకు వ్యాక్సిన్లు వేయడంతో పాటు పశు దాణా అందించడంలో నిర్లక్ష్యం చూపించొద్దన్నారు. ఆక్వా రంగంలో యాంటీ బయోటిక్స్ ను వాడే హేచరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఆక్వా లేబొరేటరీలను అభివృద్ధి చేయాలన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో పశు సంవర్ధక, మత్స్య శాఖాధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఆ శాఖ డైరెక్టర్ సోమశేఖర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు. ఊరూరి పశుగ్రాస క్షేత్రాల పేరుతో పశు గ్రాసం సాగు చేపట్టామన్నారు. వేసవిలో పశుగ్రాసాలను రైతులకు అందజేస్తామన్నారు. పశుగ్రాసాల కోత కోసం 100 యంత్రాల కొనుగోలు చేయాల్సి ఉందని సీఎస్ దినేష్ కుమార్ కు ఆయన వివరించారు. ఒక్కో యంత్రం రూ.55 లక్షల విలువ ఉంటుందన్నారు. గ్రామాల్లో పది వేల మంది పశు మిత్రలు, గోపాల మిత్రలు, పశుసఖిలతో పాటు డ్వాక్రా మహిళలతో పశు గ్రాసాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 600 మండలాల్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల పశు ధాణా తయారీకి ప్రణాళికలు రూపొందించామన్నారు. పశు గ్రాస కోత యంత్రాల కొనుగోలుకు ఫైల్ పంపితే అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ హామీ ఇచ్చారు. గోకులాల పరిరక్షణ బాధ్యత స్వచ్ఛంద సంస్థలకే అప్పగించాలన్నారు. వ్యవసాయం తరవాత పశువుల పెంపకం ద్వారానే రైతులు అధిక ఆదాయం ఆర్జిస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పశువుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాధుల నివారణకు ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, పశువులకు, గొర్రెలకు, మేకలకు వ్యాక్సిన్లు వేయాలన్నారు. పశు బీమా పథకం అమలు తీరు తెన్నులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి ఆదాయమిచ్చే పశువులు ఆకస్మికంగా మృతిచెందితే వాటి పెంపకం దారుల కుటుంబాలు రోడ్డునపడతాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీమా చెల్లింపులో నష్టపరిహారం బాధితులను ఆదుకునేలా ఉండాలన్నారు. పశు గ్రాసం, పశు దాణా పంపిణీలో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వాటి పంపిణీలో తీసుకుంటున్న విధానాలను పరిశీలించాలన్నారు. పాల ఉత్పత్తిలో ఈ ఏడాది ఎంతమేర అభివృద్ధి సాధించారని, లెక్కింపులో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారని సీఎస్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్ని పాల సేకరణ కేంద్రాలున్నాయన్నారు. నేటి వరకూ ఎన్ని పశువులను పంపిణీ చేశారని అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లోనూ పశుక్షేత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అడిగిన వారందరికీ పశుగ్రాసం, దాణా అందేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు మరింత మేలుకలిగే విధంగా పశు సంవర్ధక శాఖ తన పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ దివ్వేదిని సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.రాష్ట్ర ఇమేజ్ కు భంగం కలిగిస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తూ, చేపల పెంపకంలో యాంటీ బయోటిక్స్ వాడే హేచరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ ఏడాది ప్రస్తుతం చేపల ఉత్పత్తిలో 15 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించినట్లు మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు. 2017-18లో ఆక్వా ఎగుమతుల్లో 21.18 శాతం అభివృద్ధి సాధించామన్నారు. ఈ సందర్భంగా సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, చేపల పెంపకంలో యాంటీ బయోటిక్స్ వాడే హెచరీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా లేబరేటరీలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. చెరువుల ఏర్పాటులో పర్యావరణానికి భంగం కలుగనీయొద్దన్నారు. అంతర్జాతీయ మార్కెట్ తో పాటు దేశీయ మార్కెట్ పైనా దృష్టి సారించాలన్నారు. ఇటీవల కాలంగా ఆక్వా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఉదయ లక్ష్మి, డెయిరీ ఎం.డి మురళి తదితరులు పాల్గొన్నారు.