పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవ్వరికి అంతు పట్టకుండా ఉంది... ఆయన ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణ లోనూ రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాదు, తనకు తెలంగాణ అంటే పిచ్చి అని కూడా ప్రకటించి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. సరే. తక్కువ సమయంలోనే ఎక్కువ నేర్చుకున్నారు కాబట్టి.. ఆయన ఎక్కడ వేయా ల్సిన పాచిక అక్కడ వేస్తున్నారని సరిపెట్టుకోవాలి. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ కూడా తెలంగాణలో తమ తమ పార్టీలను అక్కడి నాయకులకే వదిలేసి.. తాము ఏపీకే పరిమితమయ్యారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో టీడీపీ, వైసీపీ గ్రాఫ్ ఎలా పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీడీపీ అక్కడక్కడా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నా.. జగన్ అసలు తెలంగాణలో తమ పార్టీ ఉన్న సంగతే మర్చిపోయినట్టు కనిపిస్తోంది. పవన్ మాత్రం.. అనూహ్యంగా రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఊపెక్కించాలని నిర్ణయించుకున్నారు. తాను ఏపీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెపుతోన్న పవన్ అక్కడే ఎక్కువుగా తిరుగుతున్నాడు. మధ్యలో తెలంగాణ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒకటి రెండు కామెంట్లు చేసి మర్చిపోతున్నాడు. ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ వైఖరి చూస్తే.. ప్రస్తుతం ఆయనకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. పేదలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోను, రైతు ల్లోనూ అనుకూల వైఖరి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి.అయితే, దీనిపై ఇంకా క్లారిటీ రాకముందే పవన్ ఇక్కడ ఓ ఆసక్తి కర ప్రకటన చేశారు. తెలంగాణలో ఏ క్షణాన ఎన్నికలు జరిగినా పోటీ చేసేందుకు వీలుగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర నేతలకు సూచించారు. జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆయన ఇప్పటి వరకు వాటి ఊసెత్తక పోగా.. ఇప్పుడు మాత్రం ఇలా ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రకటించడంపై నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనసేనతో కలిసి పనిచేసేందుకు పలు పార్టీలు తెలంగాణలో ఇప్పటికే మద్దతు ప్రకటించాయని పవన్ పదే పదే ప్రకటిస్తున్నాడు. అయితే, ఆ పార్టీలు ఏమిటో ఆయన వెల్లడించడం లేదు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో ఆయన వెంట ఉండేవి కూడా వామపక్షాలేనని అంటున్నారు పరిశీలకులు.ఈ రెండు వామపక్ష పార్టీలను మినహా యిస్తే.. ఏ ఒక్క పార్టీ కూడా పవన్‌కు మద్దతిచ్చే పరిస్తితి లేదని, ఆయన వైఖరిని తట్టుకునే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. మరి పవన్ మాత్రం వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఒకపక్క పార్టీకి కేడర్ లేదు. సభ్యత్వం లేదు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో సీపీఎం, సీపీఐలు పవన్‌తో భారీ రేంజ్‌లో కలిసి రాసుకుని, పూసుకుని తిరగడం లేదు. మరి ఇన్ని మైనస్‌లు ఉన్నప్పుడు ఆయన వచ్చే ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని ఎలా పిలుపునిస్తున్నారో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.