YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

వాన హోరు..దోమల జోరు..

 వాన హోరు..దోమల జోరు..
వానాకాలం జ్వరాల సీజన్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్యాల పాలవడం ఖాయం. అందుకే ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని నిపుణులు స్పష్టంచేస్తుంటారు. ఇదిలాఉంటే ఇటీవలి వానలు, వరదల ఎఫెక్ట్ తో మంచిర్యాల జిల్లాలో దోమల హల్ చల్ పెరిగిపోయింది. వానలు తగ్గుముఖం పట్టడం.. ఊరూవాడా బురద, చెత్తాచెదారంతో నిండిపోవడంతో దోమలు విజృంభించేస్తున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క పారిశుద్ధ్యం కరవవడంతో రోగాలూ ప్రబలిపోతాయన్న ఆందోళన నెలకొంది. దోమకాటుకు గురైన పలువురు ఇప్పటికే వ్యాధుల బారిన పడ్డారు. అనేకమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతూ వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలిన ప్రతిసారి క్షేత్రస్థాయిలో మొక్కుబడి చర్యలు చేపడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఈ విషయంలో వివిధ శాఖల అధికారుల సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జనావాసాల వద్ద వర్షపు నీరు, మురుగు నీరు నిల్వ ఉండే గుంతలు ఉంటే వాటిని వెంటనే పూడ్చేస్తే దోమలు వృద్ధి కాకుండా అరికట్టవచ్చు. కానీ జిల్లాలో ఇలాంటి చర్యలు పెద్దగా సాగడంలేదు. దీంతో దోమల విహారం అధికమైందని స్థానికులు అంటున్నారు. 
 
ఇదిలాఉంటే దోమలు అనేక రకాల వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయి. అందుకే నివాస ప్రాంతాల సమీపంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మురుగు కాలువలు, గుంతల్లో ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నట్లు గమనిస్తే వెంటనే వాటిని తొలగించాలని అంటున్నారు. అంతేకాక ఇళ్లలో రోజుల తరబడి నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. నీటి తొట్టెలపై తప్పనిసరిగా మూతలు పెట్టాలని అంటున్నారు. నిల్వ ఉన్న నీటిని వారానికొకసారి తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టంచేస్తున్నారు. గృహాన్నే కాక పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్ల సమీపంలో పిచ్చి మొక్కలు పెరగకుండా.. చెత్తా చెదారం చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. దోమల వల్ల ప్రధానంగా మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికన్‌గున్యా, వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. దోమకాటు వల్ల వచ్చే వ్యాధులన్నీ దాదాపు ఒకే రకంగా, ఒకే లక్షణాలతో ఉంటాయి. తీవ్ర జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు తదితర రుగ్మతలు బాధిస్తాయి. అయితే ఈ వ్యాధులకు కారణమైన వైరస్‌ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి పలురకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే దోమలు విస్తరించకుండా జాగ్రత్తలు పాటించాలి.

Related Posts