- చరిత్ర ఎరుగని ప్రయోగానికి ఇస్రో సిద్ధం
రెండోసారి చంద్రుడిపైన అడుగు పెట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. అంతేకాదు, చరిత్ర కనీవినీ ఎరుగని సవాల్‌ను స్వీకరించేందుకు సన్నద్ధమవుతోంది. చందమామ దక్షిణ ధ్రువంపై తనదైన ముద్ర వేసేందుకు చంద్రయాన్-2 కోసంతయారవుతోంది. అనేక సవాళ్లతో కూడుకున్న ఈ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సంకల్పించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో రెండు ప్రదేశాలను గుర్తించామని, అందులో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకుంటామని, ఆయా ప్రదేశాల్లో ప్రయోగం చేసేందుకు ఇప్పటి వరకు ఏ దేశం కూడా ప్రయత్నించలేదని, తొలిసారిగా భారత్ అందుకు సంకల్పించిందని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. దానికి సంబంధించి చంద్రయాన్-2 హార్డ్‌వేర్ సిద్ధమవుతోందని ఆయన చెప్పారు. 2018 ప్రథమార్ధం లేదంటే ద్వితీయార్ధంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు. జీఎస్ఎల్వీ మార్క్-2 ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఆ ప్రయోగ సన్నద్ధ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే తమిళనాడుల మహేంద్రగిరిలోని ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్‌లో ల్యాండింగ్ సిమ్యులేషన్ (కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి ప్రయోగాన్ని చేపట్టడం)ను చేస్తోంది ఇస్రో. అందులో భాగంగా 70-80 మీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి వాతావరణానికి అనుగుణంగా ల్యాండింగ్ ప్రక్రియపై ప్రయోగాలు చేస్తోంది.