స్వపక్షంలోనే విపక్షాలుగా వ్యవహరించే వామపక్షాలు ఒకే ఒరలో ఉన్న రెండు కత్తులతో సమానం! నిజానికి ఒకే ఒరలో రెండు కత్తులకు స్థానం లేకపోయినా.. కామ్రేడ్లు మాత్రం కలిసి ఉంటామనే అంటారు. సిద్ధాంతాలతోనే తమకు విభేదం తప్ప.. తమకు ఇతరత్రా ఉద్యమాల పరంగా మాత్రంకలిసే ఉన్నామని చెబుతూనే వ్యవహార శైలిలో మాత్రం ఎప్పటి కప్పుడు విమర్శించుకోవడం వీరికి సిద్దాంతంతో వచ్చిన విద్యగానే చెప్పాలి! సరే! స్వతంత్ర భారత దేశ చరిత్రలో నిలదొక్కుకునే స్థాయికి వచ్చినా.. కామ్రెడ్లు కలవరపడ్డారు. చైనా సిద్ధాంతాన్ని ఒకరు, రష్యా భావసూత్రాలను ఒకరు పుణికి పుచ్చుకుని పోరుకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక, ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే సీపీఎం స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడిపించింది. మిగిలిన చోట మాత్రం పొత్తులతోనే పాలించారు.ఇక, ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు విశేష కృషి చేసే వామపక్షాలు.,. ఏ పార్టీతోనూ పూర్తికాలం పొత్తును కొనసాగించిన దాఖలా కనిపించదు. ఒకవేళ కొనసాగినా.. అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవే! ఇక, ఇప్పుడు తాజాగా ఏపీలో పవన్‌తో జట్టుకట్టి జై కొట్టేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోరుకు సిద్ధమైనట్టు ఇప్పటికే వామపక్షాలు రెండూ కలసి కట్టుగా ప్రకటించాయి. మరి ఈ నేపథ్యంలో పవన్‌తో వీరి ప్రస్థానం ఎన్నాళ్లు సాగనుంది? ఒకవేళ రేపు ప్రభుత్వం ఏర్పాటైతే.. వీరి హవా ఏమేరకు కొనసాగనుంది? అనే ప్రశ్నలు సర్వసాధారణంగా వెలుగు చూస్తున్నాయి.సీపీఐ, సీపీఎంలు 2014 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా, ఒంటరిగా ముందుకు సాగినా ఫలితాలు మాత్రం ఏ మాత్రం అనుకూలించలేదు. కేడర్‌లోనూ కొంత నిరాశకు గురిచేశాయి. పవన్ సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో సీపీఎం నేరుగా ఆచంటలో కేతా గోపాలన్‌ను, పోలవరంలో తెల్లం రామకృష్ణలను తమ అభ్యర్థులుగా రంగంలోకి దింపింది. కాని ఈ రెండు చోట్ల ఆశించినంతగా ఓట్ల రూపంలో సీపీఎంకు ప్రయోజనం కలగలేదు. పోలవరంలో 2700, ఆచంటలో 1100 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఉన్న రాజకీయ వాతావరణ పరిస్థితులు అవి. అదే సీపీఐ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఏలూరు, పోలవరంలలో అభ్యర్థు లను బరిలోకి దింపింది. ఏలూరులో 1200, పోలవరంలో 1100 చొప్పున ఓట్లను మాత్రమే దక్కించు కోగలిగింది.అప్పట్లో పోలవరం నియోజక వర్గంపై వామపక్షాలు ఎక్కడా తగ్గకుండా విడివిడిగా పోటీలో నిలిచాయి. కాని దాని ఫలితం ఎలా ఉంటుందో ఈ రెండు పార్టీలకు ప్రత్యక్షంగా తెలి సొచ్చింది. ఉమ్మడిగా కలిసి మెలిసి వ్యవహరిస్తూనే రాష్ట్రంలో పార్టీలు తమ మనుగడకు ఎలాంటి డోకా ఉండదన్న అంతిమ నిర్ణయానికి వచ్చారు. చిన్నచిన్న విభేదాలు ఉన్నా క్షేత్రస్థాయిలో వాటి ప్రభావం ఏదీ పొడచూపకుండా ఇటీవలే ఇరు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. జనసేన విషయంలోనూ ఇప్పటికే ఆచితూచి అడుగు వేశాయి. జనసేన అధ్యక్షుడు పవన్ వ్యవహార శైలిని పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే ఆయనకు కొంతలో కొంత వామపక్షాలు చేరువయ్యాయి.వచ్చే ఎన్నికల్లో కనీసం 30 స్థానాలను కోరాలని వామపక్ష నాయకులు నిర్ణయించుకున్నారు. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడైతే.. పవన్ ఒంటరే.. రేపు ఆయన పార్టీ ఏదైనా కీ రోల్ పోషిస్తే మెగా బ్యాచ్ అంతా దిగిపోవడం ఖాయం. మరి అప్పుడు వామపక్షాల వైఖరిలో మార్పు ఖాయం. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఈ పార్టీలు, 2009లో టీడీపీకి చేరువయ్యాయి. మరి ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. పవన్‌తో పొత్తు రోజుకో నిప్పులా ఉండడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.